రాష్ట్రానికి చేరిన 4 లక్షల డోసులు.. నేటి నుంచి యథావిధిగా పంపిణీ - Telangana News Updates
నేటి నుంచి రాష్ట్రంలో యాథావిధిగా టీకాల పంపిణీ కొనసాగనుంది. రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి యథావిధిగా టీకాల పంపిణీ చేయనున్నారు. నిన్న రాష్ట్రానికి 4 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. 4 లక్షల డోసులను అన్ని జిల్లాలకు అధికారులు తరలించారు.
రాష్ట్రానికి చేరిన 4 లక్షల డోసులు.. నేటి నుంచి యథావిధిగా పంపిణీ
By
Published : May 4, 2021, 8:05 AM IST
నలభై అయిదేళ్లకు పైబడిన వారికి ఉచిత టీకాల పంపిణీలో భాగంగా మరో 4 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు సోమవారం రాష్ట్రానికి చేరుకున్నాయి. 50 వేల కొవాగ్జిన్ డోసులు మంగళవారం రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో టీకాల కొరత కారణంగా వారం రోజులుగా పంపిణీ మందకొడిగా సాగుతోంది. గత శని, ఆదివారాలైతే ప్రభుత్వ వైద్యంలో పంపిణీని పూర్తిగా నిలిపివేశారు. సోమవారం 200 కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సకాలంలో వ్యాక్సిన్ అందకపోవడంతో రెండోడోసు పొందాల్సిన వారు కూడా వారాల తరబడి వేచి చూడాల్సి వస్తోందని వైద్యవర్గాలే చెబుతున్నాయి. తాజాగా 4 లక్షల డోసులు చేరడంతో.. వాటిని సోమవారం రాత్రికే అన్ని జిల్లాలకూ ప్రత్యేక వాహనాల ద్వారా తరలించే ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ పంపిణీ కేంద్రాల్లో టీకాలను ఇవ్వనున్నారు.
రెండో డోసు ఎప్పుడంటే..
‘‘టీకా రెండోడోసు ఎప్పుడుతీసుకోవాలనే దానిపై చాలామందికి సందేహాలున్నాయి. కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న తర్వాత 6-8 వారాల మధ్య ఎప్పుడైనా రెండో డోసు తీసుకోవచ్చు. కొవాగ్జిన్ టీకా తొలి డోసు తీసుకున్న తర్వాత 4-6 వారాల మధ్య రెండో డోసు స్వీకరించవచ్చు. ఒకట్రెండు రోజులు అటూఇటూ అయినా ఇబ్బంది లేదు. రెండో డోసు తప్పనిసరిగా తీసుకుంటేనే యాంటీబాడీలు వృద్ధి చెంది కొవిడ్ నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది’’ అని డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు.
నమోదుకు నానా తిప్పలు
ముందుగా నమోదు చేసుకున్నవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నారు. అయితే కొవిన్ యాప్‌లో నమోదుకు అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. సాంకేతికంగా బాగా తెలిసిన వారికి కూడా ఈ యాప్ ద్వారా తేదీ, కేంద్రాన్ని ఎంపిక చేసుకోవడం కష్టతరంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో సాంకేతికంగా అంతగా పరిజ్ఞానం లేనివారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా ఇంటర్నెట్ సౌకర్యం అంతగా లేనిచోట్ల నమోదు కుదరడంలేదు. ఇది టీకా పంపిణీకి అవరోధంగా మారే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకూ ఇచ్చినట్లే వచ్చిన వారికి వచ్చినట్లుగా టీకాలు వేస్తేనే ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందని, లేదంటే కేంద్రాల వద్ద గందరగోళ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
18 ఏళ్ల పైబడినవారికి ఎప్పుడు?
18 ఏళ్ల పైబడిన వారికి టీకాల విషయంలో ఇంకా స్పష్టత రాలేదని, త్వరలో ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం దీనిపై కార్యాచరణ సిద్ధమవుతుందని వైద్యవర్గాలు తెలిపాయి. వీరందరికీ ఉచితంగా టీకాలు అందించడంలో భాగంగా లక్ష కొవాగ్జిన్ డోసులను, 2 లక్షల కొవిషీల్డ్ డోసులను సరఫరా చేయాల్సిందిగా ఆయా ఉత్పత్తి సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు తెలిసింది. అవి రావడానికి మరికొంత సమయం పడుతుందని, అప్పటి వరకూ 18 ఏళ్ల పైబడిన వారికి టీకాల అందజేత ఉండదని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.
ముందుగా నమోదు చేసుకుంటేనే..
కొవిన్ అధికారిక పోర్టల్‌లో ముందుగా నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఇక నుంచి పంపిణీ కేంద్రాల్లో టీకాలను ఇస్తామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు స్పష్టంచేశారు. 45 ఏళ్ల పైబడిన వారందరూ కొవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. సొంతంగా నమోదు చేసుకోలేనివారు సమీపంలోని ఇంటర్నెట్ కేంద్రాల్లో తమకు అనువైన పంపిణీ కేంద్రాన్ని, తేదీని ఎంపిక చేసుకోవాలని తెలిపారు. నేరుగా పంపిణీ కేంద్రాలకు వచ్చేవారికి టీకా ఇవ్వడం కుదరదన్నారు.