Free medicines: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం పొందిన రోగులకు ఇంటికి వెళ్లిన తరువాత వాడాల్సిన పూర్తి స్థాయి కోర్సు ఔషధాలన్నింటినీ ఉచితంగా అందించాలని వైద్యఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఈ ప్రతిపాదనపై సీఎం పచ్చజెండా ఊపగానే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయని వైద్యవర్గాలు తెలిపాయి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో ప్రైవేటు ఔషధ దుకాణాలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన దస్త్రాన్ని వైద్యఆరోగ్యశాఖ పక్కాగా రూపొందించింది. ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఎదురవకుండా ఉండేందుకు అవసరమైన మార్గదర్శకాలను పకడ్బందీగా రూపొందించడంపై దృష్టిపెట్టింది.
ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన దగ్గరి నుంచి రోగి కోలుకొని ఇంటికి వెళ్లే వరకూ మొత్తం చికిత్సకయ్యే మందులను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తోంది. ఓపీలో మాత్రం మందుల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని అధిగమించాలంటే.. అన్ని రకాల మందులు ప్రభుత్వ ఆసుపత్రి ఓపీ ఔషధ దుకాణాల్లో అందుబాటులోకి తీసుకురావాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నత స్థాయిలో చర్చించారు. ఈ సందర్భంగా ఏ తరహా మందులు ఎక్కువగా అవసరమవుతాయో తెలుసుకుని అందుబాటులో ఉంచితే.. ఈ సమస్య చాలా వరకూ పరిష్కారమవుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. రోగి ఆసుపత్రి నుంచి ఇంటికెళ్లేటప్పుడు.. ఇంకా ఎన్ని రోజులు మందులు వాడాల్సి ఉంటుందో తెలుసుకొని.. ఆ మేరకు ఔషధాలను కూడా ఉచితంగా అందజేయడంపైనా ప్రభుత్వం యోచిస్తోంది. ఇలా చేయడం ద్వారా మరో రూ.100 కోట్లు అదనంగా ఖర్చయ్యే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ వైద్యంలో ఔషధాల కొనుగోలుకు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం సుమారు రూ.500 కోట్లను కేటాయించింది.
కోర్టును అడ్డం పెట్టుకొని..:రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాల ఆవరణల్లో సుమారు 150 వరకూ ప్రైవేటు ఔషధ దుకాణాలు నిర్వహిస్తున్నట్లుగా వైద్యఆరోగ్యశాఖ పరిశీలనలో వెల్లడైంది. వీటిల్లో గాంధీ, ఉస్మానియా వంటి ఆసుపత్రుల ఆవరణల్లో సుమారు 70 వరకూ ఉండగా.. ఇవి రాయితీలివ్వకుండా గరిష్ఠ చిల్లర ధర(ఎంఆర్‌పీ)పైనే మందులు అమ్ముతూ నెలకు రూ.కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. వీటిల్లో అత్యధికం 20 ఏళ్ల కిందట ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నవే. ఆ గడువు ముగిసినా.. కోర్టు నుంచి స్టే తెచ్చుకొని మందులు దుకాణాలను కొనసాగిస్తున్నవారు ఎక్కువ మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి త్వరితగతిన కేసులు పరిష్కారమయ్యే దిశగా చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.