తెలంగాణ

telangana

ETV Bharat / state

Sadar Festival: సదర్‌ వేడుకలకు ముస్తాబవుతున్న భాగ్యనగరం.. భారీ దున్నలు కనువిందు - పాడి పరిశ్రమ

ఏటా దీపావళి తర్వాత యాదవులు నిర్వహించే సదర్‌ ఉత్సవాలకు నగరం ముస్తాబైంది. జంట నగరాల్లో దున్నరాజుల సందడి కనిపిస్తోంది. ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, నారాయణగూడ ప్రాంతాల్లో జరిగే వేడుకలకు హరియాణా నుంచి వాటిని నిర్వాహకులు తెప్పిస్తుండగా.. ఏటా సదర్‌ వేడుకలకు దుమ్ములేపే సుల్తాన్‌, యువరాజ్‌ల వారసులు రాణా, సర్తాజ్‌లతోపాటు ఈ ఏడాది కొత్తగా ‘కింగ్‌’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పాడి పరిశ్రమ అభివృద్ధే సంకల్పంగా సాగే సదర్ వేడుకల్లో నాలుగు భారీ దున్నరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. హర్యానాకు చెందిన సత్తార్‌, కింగ్‌, భీమ్‌, ధార దున్నలు సదర్‌లో సందడి చేయబోతున్నాయి. దున్నల పోషణ, తినే ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కో దున్నకు రోజుకు 2 వేల రూపాయలు ఖర్చు పెడతారంటే ఆశ్చర్యం వేయక మానదు.

The city of fortune is getting ready
సదర్‌ వేడుకలకు ముస్తాబవుతున్న భాగ్యనగరం

By

Published : Nov 1, 2021, 5:08 AM IST

చారిత్రక హైదరాబాద్‌కు ప్రత్యేకమైన సదర్‌ ఉత్సవంలో దున్నరాజులు కనువిందు చేయనున్నాయి. ముషీరాబాద్ నియోజకవర్గం నారాయణగూడలో దీపావళి సందర్భంగా యాదవులు నిర్వహించే సదర్ ఉత్సవాలకు హర్యానా దున్నపోతులు సందడి చేయనున్నాయి. ఇప్పటికే రెండు దున్నలు నగరానికి చేరుకోగా.. మరో రెండు కొన్నిరోజుల్లో రానున్నాయి.

వీటిలో కింగ్‌ దున్న ఎత్తు 5.8 అడుగులు, వెడల్పు 12అడుగులు బరువు 1500 కిలోలు. 1400 కేజీల బరువుండే సర్తాజ్ దున్న విశేషంగా ఆకర్షిస్తోంది. రెండు దున్న రాజుల విలువ 16 కోట్ల విలువ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ముషీరాబాద్ ప్రధాన రహదారిలోని సత్తార్ బాగ్‌లో దున్నలను ప్రదర్శనగా ఉంచారు.

సదర్‌ వేడుకలకు ముస్తాబవుతున్న భాగ్యనగరం


ఈ దున్నరాజుల పోషణకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. రోజుకి రెండుపూటలా 8లీటర్ల పాలు, పండ్లు, పచ్చి గడ్డితో పాటు వారానికోసారి అరలీటరు నువ్వుల నూనె పెడతారు. దున్న సంరక్షణ, సపర్యలకు ఇద్దరు పనివారు 24 గంటల పాటు సేవలందిస్తారు. రోజుకు రెండుసార్లు నూనెతో మర్దన, అనంతరం స్నానం చేయిస్తారు. బలవర్ధక ఆహారం, బాదం, పిస్తా, మక్కలు వంటివి ఆహారంగా ఇస్తామని యజమానులు చెబుతున్నారు. దున్నలను ఉదయం సాయంత్రం వాకింగ్ చేయిస్తారు.

కరోనా దృష్ట్యా గతేడాది సాదాసీదాగా సదర్‌ వేడుకలు జరిపినా ఈసారి ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. నగర నలుమూలల నుంచి ఉత్సవాలు వీక్షించేందుకు యాదవులు భారీగా తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు. దున్నపోతులను అందంగా అలంకరించి మేళతాళాలతో డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ ప్రదర్శనగా సదర్ వేడుకల్లో సందడి చేయనున్నాయి. దీపావళి తర్వాత హర్యానా దున్నల విన్యాసాలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.


ఇదీ చూడండి:

వైభవంగా సదర్ ఉత్సవాలు... దులియా దున్నరాజు ప్రత్యేక ఆకర్షణ

ABOUT THE AUTHOR

...view details