vacancy in telangana Human right commission: సమాజంలో ఎవరి హక్కులకైనా భంగం కలిగితే వారిని రక్షించేదే మానవ హక్కుల కమిషన్. కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలోని ఆ కార్యాలయంలో ఛైర్మన్, సభ్యులు లేక ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఎవరైనా అక్కడికి వస్తే అధికారులు లేక నిరాశతో తిరిగివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
హైకోర్టులో కేసు ఎప్పుడు వేశారు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ నాంపల్లిలోని గృహకల్పలో హెచ్చార్సీ కార్యాలయం పనిచేసింది. కమిషన్ చివరి చైర్మన్‌గా నిస్సార్ అహ్మద్ కక్రూ డిసెంబర్ 2016 వరకు పనిచేశారు. ఆయన పదవికాలం ముగిసిన తరువాత కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామకం జరగలేదు. రాష్ట్ర విభజన తరువాత 2019 వరకు రెండు రాష్ట్రాలకు ఒకే కమిషన్ పనిచేసింది. దీంతో రెండు కమిషన్లు ఏర్పాటు చేయకపోవడంపై అప్పట్లో హైకోర్టులో ప్రజాప్రయోజ వ్యాజ్యం దాఖలు కూడా అయింది.
హైకోర్టు ఆదేశం:చైర్మన్, సభ్యుల పదవులు ఖాళీగా ఉండటాన్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్తలు న్యాయపోరాటం చేశారు. పిల్స్‌పై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తీర్పు వెల్లడించింది. 2019 నవంబర్ 20 లోగా రెండు రాష్ట్రాలకు ప్రత్యేక కమిషన్ ఛైర్మన్, సభ్యులను నియమించాలని ఆదేశించింది.
డిసెంబర్ 22 నుంచి ఖాళీ కుర్చీలే:హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అదే ఏడాది డిసెంబర్ 21న కొత్త కమిషన్స్, ఛైర్మన్, సభ్యులను నియమిస్తూ అప్పటి సీఎస్ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993 సెక్షన్ 12సి ప్రకారం కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టం-2014, సెక్షన్5 ప్రకారం ఏపీ హెచ్‌ఆర్‌సీ నుంచి టీఎస్‌హెచ్ఆర్‌సీని విభజించినట్లు వివరించారు.