వచ్చే తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కనీసం 25 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. లేని పక్షంలో వ్యవసాయ రంగం, రైతాంగం అభివృద్ధి చెందకపోగా సంక్షోభం నుంచి బయటపడదని అభిప్రాయపడ్డాయి. హైదరాబాద్ ముగ్దుం భవన్‌లో అఖిల భారత కిసాన్ పోరాట సమన్వయ సమితి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ బడ్జెట్-వాస్తవాలపై చర్చా కార్యక్రమం జరిపారు. వ్యవసాయ రంగం సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, ఎదుర్కొంటున్న సవాళ్లు, త్వరలో ముగియనున్న రబీ పంట కాలం, రాబోయే ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లు, నాణ్యమైన విత్తనాలు, సంస్థాగత రుణాలు, పథకాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
పథకాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి
2020-21 రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగంలో పథకాలను చేర్చవద్దని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. రైతుబంధు, రైతుబంధు బీమా, రుణమాఫీ వంటి పథకాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్నారు. ప్రస్తుతం కేటాయించిన నిధులు.. పథకాలకు పోగా వ్యవసాయ రంగానికి మిగిలేది 13 వేల కోట్ల రూపాయలేనని పేర్కొన్నారు. అవి ఏ మూలకు సరిపోకపోగా, సంక్షోభం మరింత ముదిరిపోతోందని అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.