తెలంగాణ వ్యాప్తంగా పల్లెప్రగతి రెండో విడత కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజున గ్రామ సభలతో పల్లెలు హోరెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో కలియతిరిగారు. రెండో విడత కార్యక్రమాల పర్యవేక్షణకు వివిధ స్థాయిల్లోని నలుగురు అధికారులను నియమించటం, 2019 సెప్టెంబరు 6వ తేదీ నుంచి నెలరోజుల పాటు నిర్వహించిన మొదటి విడతలో చేపట్టిన పనుల తనిఖీకి 51 మంది అఖిల భారత సర్వీస్ అధికారులను కేటాయించటం వంటి చర్యల ప్రభావం గ్రామాల్లో స్పష్టంగా కనిపించింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పర్యటించారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట సభలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. గ్రామానికి కేఎన్‌ఆర్ గ్రూపు రూ.20 కోట్ల విరాళాన్ని ఇచ్చి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచినట్టు ఆయన కొనియాడారు. మిగతా మంత్రులూ తమతమ జిల్లాల్లోని సభలకు హాజరై పచ్చదనం, పరిశుభ్రతలపై గ్రామస్థులతో మాట్లాడారు.
సర్వతోముఖాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం
పల్లెప్రగతిలో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కోనాయిపల్లి(పీటీ)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా శుభ్రత పాటిస్తేనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.