Minister KTR: విభజన చట్టం ప్రకారం ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఎనిమిదేళ్లుగా కేంద్రం అన్యాయం చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. 2021-22కి సంబంధించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను సోమాజిగూడలో ఆయన విడుదల చేశారు. గతేడాది కొత్తగా రూ.17 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని... 96 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను మంత్రి కేటీఆర్ వివరించారు. టీఎస్ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు రూ. 2 లక్షల 32 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. గత సంవత్సరంలో రూ.17వేల కోట్లకు పైగా పెట్టుబడులు.. 96వేలకు పైగా కొత్త ఉద్యోగాలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఫార్మా రంగంలో గతేడాది రూ. 6 వేల 400 కోట్ల పెట్టుబడులతో 34వేల మందికి ఉపాధి అవకాశాలు లభించినట్లు వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ సహా వివిధ రంగాల్లోనూ గణనీయమైన ప్రగతి సాధించామని తెలియచేశారు. అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
"తెలంగాణలో పెట్టుబడుదారులకు స్వీయ ధ్రువీకరణ హక్కును అందించాం. 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఏ రాష్ట్రం చేయలేదు. తెలంగాణలో పరిశ్రమలకు నేరుగా అనుమతులు ఇచ్చే విధానం తీసుకువచ్చాం. 15 రోజుల్లో అనుమతి ఇవ్వకపోతే 16వ రోజు నేరుగా అనుమతి లభిస్తుంది. దేశంలో ఏ రాష్ట్రం ఇలా చెప్పదు. కేంద్రీకృత విధానాలను ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణకు దమ్ము, ధైర్యం, తెలివి ఉన్నాయి. ఏడున్నర ఏళ్లలో 2.32 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు టీఎస్ ఐపాస్ ద్వారా ఆకర్షించాం. 19 వేలకు పైగా అనుమతులు ఇచ్చాం. 16 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించాం. నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వానికి ఇది నిదర్శనం." -కేటీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి
తెలంగాణ ప్రస్తావన లేకుండా పారిశ్రామిక సమావేశాలు జరగడం లేదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్ల ప్రగతికి ఇదే నిదర్శనమన్నారు. సమ్మిళిత అభివృద్ధే ధ్యేయంగా ట్రిపుల్ ఐ మంత్రంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. అభివృద్ధి దిశలో పయనిస్తున్న రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వాలని కానీ అలా జరగట్లేదన్నారు. ఆరు పారిశ్రామిక కారిడార్‌లు ఇవ్వాలని కోరినా కేంద్రం స్పందించలేదని పేర్కొన్నారు. విభజనచట్టం ప్రకారం పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఎనిమిదేళ్లుగా అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఇష్టం ఉన్నా, లేకపోయినా రాష్ట్రాలతో కేంద్రం కలిసి పనిచేయాల్సిందేనని పేర్కొన్నారు. రాజకీయాలు ఎన్నికల వేళ తప్ప మిగతా సమయంలో అభివృద్ధే ఎజెండా కావాలని కోరారు.