సూర్యోదయంతోనే భానుడి భగభగలు
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు... ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం పదిరోజులుగా ఎండల తీవ్రత మరింత పెరిగింది. రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లారిందే మొదలు సూర్యోదయంతోనే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటితే చాలు..ఎండ నిప్పుల కొలిమిని తలపిస్తోంది.
అబ్బా ఉక్కపోత... రోడ్లన్నీ నిర్మానుష్యం
ఉదయం 8 గంటలకే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు దాటే వరకు రోడ్లన్నీ నిర్మానుశ్యంగా మారుతున్నాయి. ఎండ వేడిమికి తోడు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎండలో తిరగకండి...
తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైకి వస్తున్న వారు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తున్నారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బోండాలు, పళ్ల రసాలు తాగుతూ సేద తీరుతున్నారు. వేసవి తాపానికి తట్టుకోలేక పలుచోట్ల వృద్ధులు వడదెబ్బతో మృత్యువాత పడుతున్నారు.