తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ కూర్పులో పాలమూరు జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం వచ్చింది. మహబూబ్ నగర్ శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి శాసనసభ్యులు నిరంజన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నుంచి ఇద్దరికి ఫోన్లు వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన నిరంజన్ రెడ్డికి ఈసారి మంత్రివర్గంలో ప్రాధాన్యం దక్కుతుందని మొదటి నుంచే ప్రచారంలో ఉంది. అనుకున్నట్లుగా ఆయనకు మంత్రివర్గంలో పేరు ఖరారైంది. 2014 ఎన్నికల్లో వనపర్తి నుంచి పోటీచేసి ఓటమిపాలైన నిరంజన్ రెడ్డికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా కీలక బాధ్యతలు అప్పగించారు. 2018 ఎన్నికల్లో నిరంజన్ రెడ్డి విజయం సాధించడంతో ఆయన పేరే తొలి నుంచి వినబడుతోంది. ఆయనకు కీలక శాఖనే అప్పగిస్తారని తెలుస్తోంది. ఇక మహబూబ్ నగర్ శాసనసభ్యులుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన శ్రీనివాస్ గౌడ్ కు మంత్రిపదవి వరించింది. 2014లోనే శ్రీనివాస్ గౌడ్ కు మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగిన సామాజిక, రాజకీయ సమీకరణాల కారణంగా పదవి దక్కలేదు. ఈసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే శ్రీనివాస్ గౌడ్ కీలక పదవిలో ఉంటారని ఎన్నికల ప్రచార సభల్లో సీఎం ముందుగానే ప్రకటించడం కలిసొచ్చింది.