తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరి, కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల ఏకాభిప్రాయం

గోదావరి జలాలను కృష్ణాకు తరలించే విషయమై తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. హైదరాబాద్​లో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు  ఓ నిర్ణయానికి వచ్చారు. విధివిధానాలపై తదుపరి భేటీలో పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన అంశాలు, సమస్యలను పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని నిర్ణయించిన సీఎంలు... ఈ మేరకు త్వరలోనే సమావేశం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.

గోదావరి, కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల ఏకాభిప్రాయం
గోదావరి, కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల ఏకాభిప్రాయం

By

Published : Jan 14, 2020, 5:02 AM IST

గోదావరి, కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల ఏకాభిప్రాయం
గోదావరి జలాలను కృష్ణాకు తరలించే విషయమై తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. హైదరాబాద్ ప్రగతి భవన్ వేదికగా సుధీర్ఘంగా సాగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు ప్రగతి భవన్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్వాగతం పలికారు. వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. జగన్ వెంట రాగా రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోశ్​ కూడా ప్రగతి భవన్​లో ఉన్నారు.

సుధీర్ఘ చర్చ:

రెండు ప్రతినిధి బృందాలు కలిసి మధ్యాహ్న భోజన అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఇతరులు ఎవరూ లేకుండా ఇరువురూ సుధీర్ఘంగా సమావేశమయ్యారు. ముఖ్యంగా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే విషయంలో ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. కృష్ణా నదిలో ప్రతి ఏడాది నీటి లభ్యత లేకపోవడం వల్ల పంటలకు సాగునీరు అందక ఆయకట్టులో ఉన్న రాయలసీమ, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల రైతులు నష్టపోతున్నారని ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. పుష్కలమైన నీటి లభ్యత ఉన్న గోదావరి జలాలను కృష్ణాకు తరలించి అవసరమైన సందర్భంలో ఆయకట్టు రైతులకు ఇవ్వడం వల్ల రాయలసీమ, పాలమూరు, నల్గొండ వ్యవసాయ భూములకు ఖచ్చితంగా నీరు అందుతుందని అన్నారు. ఇప్పటికే సిద్దంగా ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను ఉపయోగించుకుంటూనే గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించడం వల్ల తక్కువ సమయం, తక్కువ ఖర్చు అవుతుందని తెలిపారు.

మరోసారి సమావేశం..

గోదావరి జలాల తరలింపునకు సంబంధించి ఇద్దరు సీఎంల భేటీలో స్థిర నిర్ణయం కుదిరింది. అయితే నీటిని ఎక్కడి నుంచి ఎక్కడకు తరలించాలి, వినియోగం, విధివిధానాలకు సంబంధించిన అంశాలపై మరోమారు సమావేశం విస్తృతంగా చర్చించాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారు. రెండు రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా గోదావరిృ- కృష్ణా అనుసంధానం కోసం నిర్మాణాత్మక ప్రణాళిక తయారీకి ఉభయ రాష్ట్రాల ఇంజినీర్లు సమావేశం కావాలని కూడా నిర్ణయించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన అంశాలు సహా ఇతర సమస్యలపై కూడా ముఖ్యమంత్రుల భేటీలో చర్చ జరిగింది. విభజన చట్టంలోని తొమ్మిది, పది షెడ్యూల్లలోని సంస్థలకు సంబంధించిన అనవసరంగా ఉన్న పంచాయతీని కూడా త్వరగా పరిష్కరించుకోవాలని సీఎంలు అభిప్రాయపడ్డారు.

పరస్పర సహకారంతో..

పరస్పర సహకారం, అవగాహనతో వ్యవహరిస్తే పరిష్కారం పెద్ద కష్టం కాదన్న ముఖ్యమంత్రులు... ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఫోన్లో మాట్లాడారు. విభజన సమస్యలు పరిష్కరించుకునే దిశలో త్వరలోనే సమావేశం కావాలని ఆదేశించారు. పోలీసు అధికారుల పదోన్నతుల విషయమై కూడా భేటీలో చర్చ జరిగింది. తదుపరి కార్యాచరణలో భాగంగా తెలంగాణ సీఎస్ నేతృత్వంలోని అధికారుల బృందం ఆంధ్రప్రదేశ్​కు వెళ్లనుంది. ఆ తర్వాత ఏపీ సీఎస్ నేతృత్వంలోని అధికారులు కూడా తెలంగాణ రానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం, పరస్పర సహకారం కోసం తరచూ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయించారు. ప్రజలకు ప్రయోజనం కలిగేలా రెండు రాష్ట్రాలు అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారు.

ఏపీ రాజధాని అంశంపై..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. అమరావతి స్థానంలో మూడు రాజధానులను తాను ఎందుకు ప్రతిపాదిస్తున్నది, తన ఆలోచనలను కేసీఆర్​తో జగన్ పంచుకున్నట్లు సమాచారం. వీటితో పాటు జాతీయ, స్థానిక రాజకీయాలు ఇతర అంశాలపై కూడా ముఖ్యమంత్రుల భేటీలో చర్చ జరిగింది. ముందుగా అనుకున్న ప్రకారం కేవలం రెండు గంటల పాటు మాత్రమే సమావేశం జరగాల్సి ఉంది. అయితే భేటీ సుధీర్ఘంగా ఆరు గంటల పాటు సాగింది.

ఇవీ చూడండి: 'మోదీ, రాహుల్ సహా ఎవరికీ భయపడను'

ABOUT THE AUTHOR

...view details