తెలంగాణ

telangana

ETV Bharat / state

Governor Tamilisai at TSECA: ఇంధన పొదుపుపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి: గవర్నర్​ - governor tamilisai latest news

Governor Tamilisai at TSECA: హైదరాబాద్​లో తెలంగాణ ఇంధన పరిరక్షణ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్​ తమిళిసై.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన పొదుపులో ప్రగతి సాధించిన సంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు. సౌర విద్యుత్​ వినియోగం దిశగా రాష్ట్రం ప్రత్యేక దృష్టి సారించిందని.. అందుకే ప్రభుత్వంపై ఇంధన భారం తగ్గిందని గవర్నర్​ అన్నారు.

telangana energy conservation awards event
గవర్నర్​ తమిళిసై

By

Published : Dec 19, 2021, 12:30 PM IST

Updated : Dec 19, 2021, 4:29 PM IST

Governor Tamilisai at TSECA: విద్యుత్​ను ఆదా చేసేందుకు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఇంట్లో పిల్లలకు కూడా విద్యుత్ ఆదాపై అవగాహన కల్పించాలని గవర్నర్ సూచించారు. హైదరాబాద్​ హైటెక్స్​లో జరిగిన తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ- టీఎస్​రెడ్కో ఆధ్వర్యంలో రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డులు టీఎస్​ఈసీఏ- 2021 ప్రదాన కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్​ శర్మ, ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ ప్రభాకర్​ రావు, రెడ్కో ఛైర్మన్​ జానబ్​ సయ్యద్​ అబ్దుల్​ అలీమ్​, వైస్​ ఛైర్మన్​ ఎన్​. జానయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ విద్యుత్​ ఆదా చేయాలి: గవర్నర్​

సోలార్​ విద్యుదుత్పత్తిలో టాప్​

Telangana energy conservation awards: ఇంధన పొదుపుపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని.. తద్వారా విద్యుత్​ వృథా కాకుండా చేయవచ్చని గవర్నర్​ సూచించారు. విద్యుత్ ఆదా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేస్తోందని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఎల్ఈడీ బల్బుల వినియోగంతో విద్యుత్ ఆదా అవుతుందని చెప్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విద్యుత్​ ఆదా చేయాలని గవర్నర్ కోరారు. అనంతరం వివిధ విభాగాల్లో ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా రెడ్కో సంస్థ సూచించిన ప్రమాణాలకు మించి ఇంధన పొదుపు చేపట్టిన వివిధ సంస్థలు, పరిశ్రలు, విద్యాసంస్థలు, రైల్వే స్టేషన్లు, బస్ డిపోలకు టీ.ఎస్.ఈ.సి.ఎ -2021 అవార్డులను గవర్నర్ అందజేశారు. ఈ మేరకు టీఎస్ రెడ్కోను గవర్నర్ అభినందించారు. హరిత తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారని కొనియాడారు. గ్రీన్ పవర్ కోసం సోలార్ పాలసీ ఏర్పాటు చేశారని.. సోలార్ విద్యుత్​ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ముందుందని గవర్నర్ అభినందించారు.

వ్యక్తిగత బాధ్యత

ఇంధన పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. సోలార్​ విద్యుత్​ వినియోగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందుకే రాష్ట్రంపై ఇంధన భారం తగ్గింది. విద్యుత్​ పొదుపులో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలి. అంతే కాకుండా ఇంధన పొదుపుతో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సహజ వనరులను వృథా చేయకుండా పిల్లలకు పలు సూచనలు చేయాలి. ప్రకృతి వనరులను పరిరక్షించుకుంటూ ముందు తరాలకు అంతే జాగ్రత్తగా మనం అప్పగించాలి. ఇంధన పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు దేశాలు ఒక్కో రోజును కేటాయిస్తున్నాయి. అదే విధంగా మన దేశంలో ఒక రోజు ఇంధన పొదుపు దినోత్సవంగా పాటిస్తే సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. - తమిళిసై సౌందర రాజన్​, గవర్నర్​

24 గంటల విద్యుత్​

దేశంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ట్రాన్స్ కో-జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని చెప్పారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని.. గత మార్చిలో 13,680 మెగా వాట్స్ పీక్ డిమాండ్​ను అధిగమించామని వివరించారు.

మరిన్ని కేంద్రాలు

సోలార్ విద్యుత్​ వినియోగంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ పేర్కొన్నారు. ఈ సంవత్సరం 700 ఈవీ వాహనాల ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిమాండ్ ఉంటే మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక చేస్తామని తెలిపారు. ఈవీ పాలసీలో భాగంగా విద్యుత్ వాహనాలకు రూ.35 కోట్ల సబ్సిడీ ఇచ్చామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Paddy Cultivation in Jagtial: జగిత్యాల జిల్లాలో వరి సాగుకే రైతన్నల మొగ్గు.. ఎందుకంటే?

Last Updated : Dec 19, 2021, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details