హైదరాబాద్ మహా నగరంలో ఉచిత తాగునీటి పథకానికి అర్హులైన వారికి నీటి మీటర్లను ఏర్పాటు చేశామని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ తెలిపారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన నెలకు ఇరవై వేల లీటర్ల ఉచిత తాగు నీటి పథకం అమలు, పురోగతిపై చర్చించారు. నల్లా కనెక్షన్‌కు ఆధార్‌ను అనుసంధానించేందుకు గడువును పురపాలక శాఖ మంత్రి ఏప్రిల్ 30 వరకు పెంచినట్లు అసెంబ్లీలో ప్రకటించారని పేర్కొన్నారు.
నగరంలోని డొమెస్టిక్ వినియోగదారులు మీ-సేవ కేంద్రాల్లో, జలమండలి వెబ్సైట్లో లాగిన్ అవ్వడం ద్వారా ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చని ఎం. కిశోర్ తెలిపారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రతీ సెక్షన్‌కు ఒక ఆధార్ బయోమెట్రిక్ పరికరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సౌలభ్యం మరిన్ని రోజులు కొనసాగుతుందన్నారు. డొమెస్టిక్ కేటగిరిలో మీటర్ లేని వినియోగదారులను గుర్తించి కొత్త మీటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇప్పటివరకు డొమెస్టిక్ స్లమ్‌లలో ఆధార్ అనుసంధాన ప్రక్రియ 50 శాతం పూర్తయిందన్నారు.