Telangana Teacher Transfers 2023 From September 3 : హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. సెప్టెంబరు 3 నుంచి టీచర్ల బదిలీల(Teacher Transfers) ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indhrareddy) తెలిపారు. ఈ ప్రక్రియలో టీచర్ల పదోన్నతులు, బదిలీ(Teacher Promotions)లు అక్టోబరు 3లోపు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం లేదా శనివారం టీచర్ల బదిలీలకు షెడ్యూలు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీచర్ల బదిలీలు, పదోన్నతులపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సచివాలయంలో సమావేశం నిర్వహించారు.
కోర్టు తీర్పునకు లోబడి టీచర్ల పదోన్నతులు బదిలీలు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పారదర్శకతతో, అపోహలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. బదిలీలకు విధి, విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని అర్హులైన టీచర్లకు మెసేజ్ పంపాలని అన్నారు. ఆన్లైన్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.
ఒకే ఒక విద్యార్థి.. ఆమె కోసం ఐదుగురు ఉపాధ్యాయులు..!
Telangana Teacher Promotions 2023 :అయితే కొందరు ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉపాధ్యాయ ఖాళీల భర్తీని.. డీఎస్సీకి అప్పగించినట్లు తెలిపారు. ఉపాధ్యాయ ఖాళీలపై తప్పుడు ఆరోపణలతో రాజకీయ లబ్ధికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఈ విధంగా విద్యారంగానికి పెద్దపీట వేస్తుండటాన్ని కాంగ్రెస్ సహించలేకపోతోందని విమర్శించారు. తొమ్మిదేళ్లలో విద్యారంగం అభివృద్ధికి రూ.1,87,269 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. 2017లో 8,972 టీచర్ పోస్టులను భర్తీ చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.