రాష్ట్రంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఎక్కడుంటుంది.. అని అడిగితే వెంటనే హైదరాబాద్ గుర్తొస్తుంది ఎవరికైనా. గతేడాది మాత్రం మహబూబ్‌నగర్, కరీంనగర్, రామగుండం, మెదక్ హైదరాబాద్‌ను దాటేశాయి. ఆయా ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలిని కలుషితం చేసే సూక్ష్మ ధూళి కణాల తీవ్రత (పీఎం 10) అత్యధికంగా నమోదైనట్లు తాజాగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ) లెక్క తేల్చింది.
నల్గొండలో మినహా మిగిలిన పదిచోట్ల పీఎం10 కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్దేశిత పరిమితుల్ని దాటినట్లు గుర్తించారు. హైదరాబాద్ సహా వివిధ నగరాలు, పట్టణాల్లో టీఎస్ పీసీబీ వాయు కాలుష్య నమోదు కేంద్రాలను నిర్వహిస్తోంది. వాటిలో నమోదైన గణాంకాల ఆధారంగా 2020లో పీఎం 10 తీవ్రతను లెక్కించారు. ఒక్క నల్గొండలో మాత్రమే నిర్దేశిత పరిమితుల కంటే 7 ఎంజీలు తక్కువగా నమోదైంది.