వ్యాధుల ముప్పు పొంచి ఉందని వైద్యఆరోగ్యశాఖ హెచ్చరించింది. వరదల ప్రభావంతో డయేరియా, జిగట విరేచనాలు, గ్యాస్ట్రోఎంటరైటిస్, కామెర్లు, టైఫాయిడ్, మలేరియా, డెంగీ, గన్యా, మెదడువాపు వంటి వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదముందని పేర్కొంది.
వరదలతో పాటే వ్యాధులు... పొంచి ఉన్న డయేరియా, మలేరియా, డెంగీ..
By
Published : Oct 17, 2020, 6:39 AM IST
ఉప్పొంగిన వరదలకు తాగునీటి వనరులు కలుషితమయ్యే అవకాశాలున్నాయని, ప్రజలందరూ తాగునీటిని మరగబెట్టి, చల్లార్చి తాగాలని స్పష్టం చేసింది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తిరిగి ఇళ్లలోకి చేరడానికి ముందు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యఆరోగ్యశాఖ సూచించింది. కొవిడ్ నిబంధనలను ఇకపైనా కొనసాగించాల్సిందేనని తెలిపింది. ఈ మేరకు గురువారం మార్గదర్శకాలు విడుదల చేసింది.
పునరావాస కేంద్రాల్లోనూ కొవిడ్ ముప్పు
జీహెచ్‌ఎంసీ పరిధిలో 68 పునరావాస కేంద్రాల్లో వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కేంద్రాల్లో 3,325 మందికి ఇప్పటివరకూ వైద్యసేవలు అందించారు. వీరిలో 495 మంది అనుమానితులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 25 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిని ఆసుపత్రులకు తరలించారు. ఈ కేంద్రాల్లో ఉన్నవారికి 3,459 మాస్కులు, 350 శానిటైజర్లను అందజేసినట్లు ప్రజారోగ్య సంచాలకులు డా.జి.శ్రీనివాసరావు తెలిపారు. కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నవారు తప్పకుండా మాస్కులు ధరించాలని, ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే అక్కడి వైద్యశిబిరంలో పరీక్షలు చేయించుకోవాలని శ్రీనివాసరావు కోరారు.
వరద నీరు చేరిన ఇళ్లు శుభ్రం ఇలా..
వరద నీటితో నిండిన ఇళ్లలో నీటిని పూర్తిగా తొలగించిన అనంతరం.. ఇంట్లో ఉపరితలాలను, వస్తువులను, దుస్తులను, వస్త్రాలను, సామగ్రిని గోరు వెచ్చటినీరు, సబ్బుతో కలిపి శుభ్రపర్చాలి.
అనంతరం అన్ని ఉపరితలాలను, వస్తువులను హైపోక్లోరైట్ ద్రావణంతో ఇన్‌ఫెక్షన్ రహితంగా చేసుకోవాలి. ఒక లీటరు నీటిలో 50 మి.లీ. హైపోక్లోరైట్ ద్రావణాన్ని కలిపి 15 నిమిషాల అనంతరం వినియోగించాలి.
శుభ్రపర్చిన వస్తువులను, దుస్తులను సాధ్యమైనంత వరకూ ఎండలోనే ఆరబెట్టాలి.