TS Cabinet Meeting Today : మూడు నెలల విరామం తర్వాత రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. చాలా రోజుల తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో.. ఎజెండాలో చాలా అంశాలు ఉన్నట్లు సమాచారం. యాసంగి పంటకు సంబంధించిన రైతుబంధు నిధుల విడుదల విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. దళితబంధు పథకం అమలు తీరును సమీక్షించి.. తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు. సొంత స్థలం కలిగిన వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థికసాయం పథకం విధివిధానాలపై చర్చించి అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ ఆంక్షలపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిధుల సమీకరణ అంశంపైనా చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో మంజూరు అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. పోడు భూముల అంశంపై కసరత్తును కేబినెట్ సమీక్షించనుంది. సర్వే, గ్రామ సభలు పూర్తయిన తరుణంలో క్షేత్రస్థాయి స్థితిగతులు, తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. డీఎఫ్‌వో శ్రీనివాస్ రావు హత్య నేపథ్యంలో అటవీ అధికారులు, సిబ్బందికి రక్షణా చర్యల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీఆర్ఏలకు వేతన స్కేల్ అంశంపై చర్చించి.. నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రహదార్లు-భవనాలు, పంచాయతీరాజ్ శాఖల పునర్ వ్యవస్థీకరణపై చర్చ జరగనుంది. ధాన్యం కొనుగోళ్లపైనా సమీక్షించనున్నారు.
కొత్త పోస్టులకు అవకాశం..: కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) నుంచి మరో రూ.పది వేల కోట్ల రుణ ప్రతిపాదనలపైనా చర్చ జరగనుంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఉద్దండాపూర్ జలాశయ నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో డ్రగ్ ట్రాఫికింగ్, డ్రగ్ పెడ్లింగ్‌పై ఉక్కుపాదం మోపేలా నార్కోటిక్స్‌కు ప్రత్యేక వింగ్ ఏర్పాటుపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పాత పది జిలాల్లో ప్రత్యేక స్టేషన్ల ఏర్పాటు, రెండు వేల కొత్త పోస్టులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. సైబర్ క్రైమ్, ఇతర విభాగాల్లో మరో రెండు వేల పోస్టులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గురుకుల కళాశాలల ఏర్పాటు నేపథ్యంలో కొత్తగా 3,000 పోస్టులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
గవర్నర్ స్థానంలో మరొకరు ఉండేలా..: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేంద్రం ఆంక్షలపై చర్చించేందుకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సమావేశాల నిర్వహణపై కేబినెట్‌లో చర్చించి తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న బిల్లులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను కోరుతూ తీర్మానం చేసే అవకాశం ఉంది. విశ్వవిద్యాలయాలకు ఛాన్స్‌లర్‌గా గవర్నర్ స్థానంలో మరొకరు ఉండేలా చట్ట సవరణ కోసం బిల్లును తీసుకొస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇతర బిల్లులపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది. వీటితో పాటు ఇతర రాజకీయ, పాలనాపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.