తెలంగాణ

telangana

ETV Bharat / state

నష్టనివారణ చర్యలపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి - telangana state road transport corporation

వరుసకష్టాలతో ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆర్టీసీ నష్టనివారణ చర్యలపై దృష్టి సారించింది. కొవిడ్ సడలింపులతో ఎట్టకేలకు బస్సులు రోడ్డెక్కినా ఆరంభంలో ఆశించిన స్పందన రాలేదు. క్రమంగా వైరస్‌పై పెరుగుతున్న అవగాహనతో ప్రజారవాణాకు మళ్లీ ఆదరణ పుంజుకుంటోంది. ఇదే బాటలో సేవల విస్తరణకు యాజమాన్యం చర్యలు చేపడుతోంది.

Telangana RTC measures for increasing revenue
నష్టనివారణ చర్యలపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి

By

Published : Nov 2, 2020, 5:23 AM IST

నష్టనివారణ చర్యలపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి

అప్పటికే ఆర్టీసీకి అంతంతమాత్రమే ఆదాయం.. ఆపై దాదాపు రెణ్నెళ్లపాటు కార్మికుల సమ్మె. ఆ తర్వాత వెంటనే లాక్‌డౌన్‌. వరస కష్టాలతో ఆర్టీసీ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది. తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సంస్థకు... కరోనా కారణంగా బస్సులు ఎక్కే వారే లేకపోవడం వల్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. కార్మికులకు జీతాలిచ్చేందుకు సర్కారుపై ఆధారపడాల్సి వచ్చింది. సంస్థకు ప్రధాన ఆదాయ వనరైన హైదరాబాద్‌లో ఆర్నెళ్లకు పైగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. నెలరోజుల క్రితం లాక్‌డౌన్ సడలింపులిచ్చినా ప్రయాణీకుల నుంచి స్పందన కనిపించలేదు. కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ మళ్లీ ఆదాయం పుంజుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు.

పెరుగుతున్న ఆదరణ

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ఆర్టీసీకి 29 డిపోలుండగా వాటిలో 2800 పైగా బస్సులు నడుస్తుంటాయి. కొవిడ్‌తో ఆర్నెళ్లపాటు డిపోలకే పరిమితమైన బస్సులు... ప్రభుత్వ సడలింపులతో క్రమంగా రోడ్డెక్కాయి. ఇటీవల వైరస్‌పై ప్రజల్లో పెరిగిన అవగాహన వల్ల క్రమంగా ప్రజారవాణాకు ఆదరణ పెరుగుతుంతుండటం వల్ల అదనపు సిబ్బందిని నియమించిన యాజమాన్యం... నగరవ్యాప్తంగా తిరుగుతున్న బస్సులు, జనం ప్రయాణించే సమయం, కరోనా జాగ్రత్తలపై వివరాలు సేకరించింది. ఈ మేరకు డిమాండ్ ఉన్న రూట్లకు అనుగుణంగా బస్సులు కేటాయించారు. అధికారుల నిర్ణయంతో ఆర్టీసీలో ఓఆర్​ 45శాతానికి పెరగ్గా.. రోజుకు కోటి 20లక్షల వరకు ఆదాయం వస్తోందని అంచనా వేశారు.

గ్రేటర్​లో మరిన్ని బస్సులు

కరోనాపై ప్రజల్లో అవగాహన పెరిగినందున.. ఆర్టీసీ వైపు మళ్లీ మొగ్గుచూపుతున్నారని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి బస్సుల సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్రేటర్‌లోని 3వందల రూట్లలో 12వందల బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. అన్ని రూట్లలో బస్సులు అందుబాటులో ఉంటాయన్న అధికారులు.. కొవిడ్‌ జాగ్రత్తలను పకడ్బందీగా అమలుచేస్తున్నట్లు చెప్పారు. బస్సు ట్రిప్‌ ముగిసిన వెంటనే పూర్తిగా శానిటైజ్‌ చేయనున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి: సోమవారం రాత్రి నుంచి తెలంగాణ-ఏపీ మధ్య బస్సు సర్వీసులు..?

ABOUT THE AUTHOR

...view details