Telangana Rain Problems 2023 :రాష్ట్ర వ్యాప్తంగాజిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం కొనసాగుతూనే ఉంది. గోదావరి పరీవాహకంలో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతుండగా.. చెరువులు జలకళ సంతరించుకున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి వాగులు పొంగిపొర్లుతున్నాయి. బయ్యారం పెద్ద చెరువు అలుగు పారుతోంది. చింతుని గుంపు వద్ద జలపాతం పరవళ్లు తొక్కుతోంది. వట్టి వాగు ఉద్ధృతికి బయ్యారం.. తిమ్మాపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల శివారులో పాకాల వాగు పొంగి ప్రవహిస్తుండడంతో రాంపురం ,మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాకాల వాగుపై వంతెన నిర్మించాలంటూ స్థానికులు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.
Telangana Rains Today :మహబూబ్‌నగర్ ఎర్రకుంట చెరువు, పెద్దచెరువు మినీ ట్యాంక్‌బండ్ సహా లోతట్టు ప్రాంతాలను ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. వరద బాధితులకు పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముంపునకు గురయ్యే అవకాశం ఉంటే, అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవసరమైన చోట కొత్తనాలాలు నిర్మించి వరద సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
Heavy Rains in Telangana : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మారుమూల గ్రామం సీతారాంపురంలో జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వాగును దాటుతూ వెళ్లిన వైద్యసిబ్బంది వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా అవగాహన కల్పించారు. మరోవైపు భద్రాచలంలో గోదావరి వరదల్లో నాటు పడవలు పెట్టి.. సేవలు అందించబోమని గజ ఈతగాళ్లు స్పష్టం చేశారు. గతేడాది అత్యవసర సేవలకు వినియోగించుకున్న అధికారులు ఇంతవరకు ఆ సొమ్ము చెల్లించలేదని వాపోయారు. తమ గోడు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కలిసి వెళ్లబోసుకోగా.. పాతబకాయిలు ఇప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
మంచిర్యాల జిల్లా మందమర్రిలో సుబాన్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సారంగపల్లికి చెందిన యువకుడు శంకరపల్లి సమీపంలోని పాలవాగు దాటుతుండగా వరద ఉద్ధృతికి ద్విచక్రవాహనంతో సహా అదుపుతప్పి అందులో పడిపోయాడు. చెట్టును పట్టుకొని ఒడ్డుకు చేరుకున్నాడు. గ్రామస్థులు వాగులో కొట్టుకుపోతున్న బైక్‌ను అతి కష్టం మీద బయటకు తీశారు.