Telangana projects: విభజన చట్టానికి లోబడి కృష్ణా, గోదావరి నదులపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ కోసం నదీ యాజమాన్య బోర్డులను ఏర్పాటు చేశారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గత జులై 15న కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా... అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వచ్చింది. రెండు రాష్ట్రాలు ఏ ఒక్క ప్రాజెక్టును బోర్డులకు స్వాధీనం చేయలేదు. అనుమతుల్లేని ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించిన కేంద్రం... వాటికి ఆర్నెళ్లలోగా అనుమతులు తీసుకోవాలని పేర్కొంది. ఈ నెల 14వ తేదీతో ఆ గడువు ముగియనుంది.
కృష్ణా, గోదావరిపై రాష్ట్రం చేపట్టిన పలు ప్రాజెక్టులు అనుమతుల్లేని జాబితాలో ఉన్నాయి. పాలమూరు - రంగారెడ్డి, కాళేశ్వరం అదనపు టీఎంసీ, సీతారామ, సమ్మక్క సాగర్, డిండి, చనకా - కొరాటా, మొడికుంటవాగు, తుమ్మిళ్ల, ప్రాణహిత, రామప్ప-పాకాల లింక్, కందకుర్తి, గూడెం ఎత్తిపోతల తదితర ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.
డీపీఆర్‌ల సమర్పణ...
కృష్ణాకు సంబంధించి రాష్ట్రానికి నీటి కేటాయింపులు చేయాలని కోరుతున్న ప్రభుత్వం ఆ అంశాన్ని ట్రైబ్యునల్‌కు నివేదించాలని పేర్కొంది. గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు పొందే ప్రక్రియను ప్రారంభించింది. కేంద్ర జలసంఘం జీఆర్ఎంబీకి ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించింది. సీతారామ, ముక్తేశ్వర, చౌటుపల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల పథకాలు, చనాఖా- కొరాటా ఆనకట్ట, సమక్కసాగర్, మోడికుంటవాగు ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చారు. ప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్ తయారీ దశలో ఉంది.