ప్రైవేటు టీచర్ల ఆకలి కేకల సమస్యల పరిష్కారానికై తెలంగాణ ప్రైవేట్ టీచర్ల ఫోరమ్ ఆధ్వర్యంలో కాచిగూడలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరై మద్దతు ప్రకటించారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఉపాధ్యాయులు మానసికంగా, ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాపోయారు.
అరణ్య రోదనగా, ప్రైవేట్ అధ్యాపకుల ఆకలి కేకలు.. - Telangana Private Teachers in Telangana
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోమని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా అరణ్య రోదనగా మారిందని తెలంగాణ ప్రైవేట్ టీచర్ల ఫోరమ్ అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి ఉన్నత చదువులు చదివి కూడా ఈరోజు ఉన్న ఉద్యోగాలు కూడా కోల్పోయి ఊహించలేనటువంటి పనులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్న దయనీయ పరిస్థితి అని వాపోయారు.
తమ శ్రమను దోచుకొని కోట్లకు కోట్లు కూడబెట్టిన ప్రైవేట్ యాజమాన్యాలు కూడా నోరు మెదపడం లేదని ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ వెల్లడించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితిని లేవనెత్తిన... ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని తెలిపారు. సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.