కొత్త సచివాలయంలో.. ప్రారంభోత్సవం రోజు నుంచే పనులు షురూ Telangana New Secretariat: రాష్ట్ర పరిపాలనా సౌధం అత్యాధునికంగా సిద్ధమవుతోంది. విశాలంగా, ఆధునికతను జోడించి కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొత్త సచివాలయ భవన ప్రారంభోత్సవం జరగనుంది. ప్రారంభం అయ్యాక అక్కడి నుంచే పూర్తి స్థాయి కార్యకలాపాలు నిర్వహించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం అయిన మరుసటి రోజు నుంచే రోజువారీ పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రారంభోత్సవానికి ముందే అన్ని శాఖలను కొత్త భవనంలోకి తరలించనున్నారు.
సచివాలయంలో పూర్తి స్థాయిలో కొత్త ఫర్నీచర్ :సచివాలయంలో పూర్తిస్థాయిలో కొత్త ఫర్నీచర్‌ను వినియోగిస్తున్నారు. కొత్త ఫర్నీచర్ ఏర్పాటు చేసే పనులన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం నెట్ వర్కింగ్, సంబంధిత పనులు కొనసాగుతున్నాయి. దీంతో తరలింపులో భాగంగా కంప్యూటర్లు, దస్త్రాలను మాత్రమే తరలించాల్సి ఉంటుంది. ఇందుకోసం సాధారణ పరిపాలనాశాఖ విధివిధానాలు జారీ చేయనుంది. తరలింపు కోసం ఏజెన్సీలను కూడా ఖరారు చేసి ఆయా శాఖలకు సమాచారం ఇవ్వనున్నారు. ఈలోగా కొత్త సచివాలయంలో శాఖల వారీగా కేటాయింపు చేయాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ కసరత్తు పూర్తై ఒకటి, రెండు రోజుల్లో కేటాయింపు పూర్తవుతుందని భావిస్తున్నారు.
వచ్చే వారం నుంచి తరలింపు ప్రక్రియ ప్రారంభం: ఆరో అంతస్థులో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు కేబినెట్ సమావేశ మందిరం, సీఎస్ కార్యాలయం ఉండనుంది. ఒకటి నుంచి ఐదు అంతస్తులను ఆయా శాఖలకు కేటాయించనున్నారు. అధికంగా విభాగాలు ఉండే ఆర్థిక, సాధారణ పరిపాలన, రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, నీటిపారుదల శాఖలకు ఎక్కువ విస్తీర్ణం అవసరం ఉంటుంది. జీఏడీకి మొదటి, ఆర్థికశాఖకు రెండో అంతస్థును కేటాయిస్తారని అంటున్నారు. సంబంధిత శాఖ మంత్రి, కార్యదర్శి, విభాగాలను ఒకే దగ్గర కేటాయించనున్నారు. ఇప్పటికే ఆయా శాఖల అధికారులు కొత్త సచివాలయంలోని ఛాంబర్లు, గదులను పరిశీలిస్తున్నారు. కేటాయింపు ప్రక్రియ పూర్తై ఆదేశాలు జారీ చేస్తే వచ్చే వారం నుంచి తరలింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు.
పటిష్ఠంగా సచివాలయ భద్రతా వ్యవస్థ:30వ తేదీ లోపు తరలింపు పూర్తి చేసి ప్రారంభోత్సవం అయిన తర్వాత మే ఒకటో తేదీ నుంచి కొత్త సచివాలయం నుంచే పూర్తి స్థాయి కార్యకలాపాలు నిర్వహించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెప్తున్నారు. ఇక సచివాలయ భద్రతా వ్యవస్థను కూడా మరింత పటిష్ఠం చేస్తున్నట్లు సమాచారం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సచివాలయం పహారాకు సాయుధ బలగాలతో పాటు స్పెషల్ పోలీసులను వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సచివాలయ భద్రతను ఎస్పీఎఫ్ నిర్వహిస్తుండగా... వారి స్థానంలో స్పెషల్ పోలీసులను వినియోగించాలని నిర్ణయించినట్లు చెప్తున్నారు.
ఇవీ చదవండి: