Telangana New Secretariat : తెలంగాణ సచివాలయం 28 ఎకరాల విస్తీర్ణంలో సుందరంగా సిద్ధమవుతోంది. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు కాగా.. 265 అడుగుల ఎత్తున నిర్మించారు. ప్రస్తుత ప్రాంగణంలోనే నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణాన్ని 2020 జనవరిలో ప్రభుత్వం చేపట్టింది. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ ప్రారంభించేందుకు నిర్ణయించారు. అధికారులు ఉరుకులు పరుగుల మీద రాత్రింబవళ్లు పనులు చేయిస్తున్నారు. 11 అంతస్తుల ఎత్తుతో నిర్మాణం కనిపించినా ఆరో అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరం ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు.
Telangana New Secretariat Height : ప్రస్తుతం ఉన్న 16 మంది మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల కార్యాలయాలు ఉంటాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం సిద్ధమవుతోంది. ఉన్నతాధికారులు, సిబ్బంది, సందర్శకులకు కూడా ప్రాంగణంలోనే పార్కింగ్ సదుపాయం కల్పించారు. సచివాలయ నిర్వహణ సిబ్బంది, స్టోర్స్ తదితరాలు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేశారు. 7 నుంచి 11 అంతస్తుల ఎత్తులో డోములు నిర్మించారు. 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలను ఏర్పాటు చేశారు. ప్రధానమైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ చిహ్నమైన 4 సింహాల చిహ్నాలను ఏర్పాటు చేశారు.
Telangana New Secretariat Inauguration Date Fix..: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ఇటీవలే తేదీ ఖరారు చేశారు. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజున.. ఆయన కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఆధునిక హంగులతో సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. వాస్తు సహా అన్ని రకాలుగా పరిశీలించి 20 ఎకరాల మేర చతురస్రాకార స్థలాన్ని ఎంపిక చేసి అందులో కొత్త సచివాలయ నిర్మాణ పనులు 2020 జనవరిలో చేపట్టారు. ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి. ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు మంత్రివర్గ సమావేశ మందిరం, పెద్ద సమావేశ మందిరం తదితరాలు ఉంటాయి.