రాష్ట్రంలోని 53 పురపాలికలు, 3 కార్పొరేషన్ల పాలకమండళ్ల పదవీకాలం... వచ్చే నెల రెండో తేదీతో పూర్తి కానుంది. అయితే ఎన్నికలు జరగనందున ఆలోగా కొత్త పాలకమండళ్లు కొలువుతీరే అవకాశం లేదు. ప్రత్యేకాధికారుల నియామకం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికారుల నియామకానికి సంబంధించి జులై రెండో తేదీన ఉత్తర్వులు వెలువడనున్నాయి. మరోవైపు జులై నెలలో పురపాలక ఎన్నికలు నిర్వహిస్తామన్న సీఎం ప్రకటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా ముందస్తు ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఓటర్ల గుర్తింపు చేపట్టారు.
ప్రత్యేకాధికారుల నియామకానికి ప్రభుత్వం కసరత్తు
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో... ఓటర్ల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. ఎన్నికలు జరుగుతున్న చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు కోసం సర్వే నిర్వహిస్తుండగా.. అన్ని చోట్లా బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ సాగుతోంది. ఈ మేరకు పురపాలక శాఖ సంచాలకులు శ్రీదేవి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. 28 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.
18న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితా ప్రకటన