డెంగీ, మలేరియా, సీజనల్ వ్యాధుల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పారిశుద్ధ్యం, వసతిగృహాలు, గురుకులాల్లో ఆహార నాణ్యత, కొవిడ్, బూస్టర్ డోసులకు సంబంధించి యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ మేరకు సంబంధితశాఖల మంత్రులు అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఐటీడీఏ పీఓలు, డీపీఓలు, డీఎంహెచ్ఓలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులు సమీక్షకు హాజరయ్యారు.
సీజనల్ వ్యాధుల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలన్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు... అన్ని పాఠశాలలు, వసతిగృహాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి శుక్రవారం డ్రైడేగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు పది నిమిషాల చొప్పున ప్రతి ఒక్కరూ ఇండ్లలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, డ్రైనేజీల శుభ్రత, దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి... తమ ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకొని వ్యాధులు రాకుండా ఉండేందుకు సహకరించాలని కోరారు. డెంగీ చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్న హరీష్ రావు... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డెంగీ కేసులు కనిపిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాలకు సీజనల్ వ్యాధులుకు సంబంధించి శ్వేతా మెహంతిని ప్రత్యేకాధికారిగా నియమించినట్లు తెలిపారు. మలేరియాను రాష్ట్రంలో గత ఆరేళ్లుగా బాగా నిర్మూలించామని, ములుగు, కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడా మలేరియా కేసులు ఉన్నాయని వివరించారు.
సీజనల్ వ్యాధులపై కలెక్టర్లు, అధికారులను అప్రమత్తం చేశాం. మంకీ ఫాక్స్ లక్షణాలు ఉన్న వ్యక్తి నమూనాలు ల్యాబ్‌కు పంపాం. ఫీవర్ ఆసుపత్రిని నోడల్ ఆసుపత్రిగా పెట్టాం. గాంధీలోనూ పరీక్షలు చేయిస్తాం, కిట్లు తెప్పిస్తున్నాం. మంకీ ఫాక్స్ విషయంలో ఆందోళన చెందొద్దు. డెంగీ చికిత్స కోసం ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేశాం. హైదరాబాద్ పరిధిలో డెంగీ కేసులు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాలి. ప్రభుత్వ పరంగా అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపడుతున్నాం. ప్రతి శుక్రవారం విద్యాసంస్థలు, పాఠశాలల్లో డ్రైడే పాటించేలా చర్యలు చేపట్టాలి. ప్రతి ఆదివారం ఇళ్లలో డ్రైడే పాటించేలా చర్యలు తీసుకోవాలి. - హరీశ్‌రావు, ఆరోగ్య శాఖ మంత్రి
యాంటీ లార్వా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు, సిబ్బందిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. గ్రామాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పారిశుధ్య నిర్వహణ పక్కాగా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. వసతిగృహాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం విషయంలో వార్డెన్‌లదే బాధ్యత అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురుకులాలు, వసతిగృహాల్లో ప్రతిరోజూ పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. బియ్యం నాణ్యత విషయంలో కలెక్టర్లు పూర్తి జాగ్రత్తతో ఉండాలన్న పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్... తరచూ పాఠశాలు, వసతిగృహాలను సందర్శించాలని చెప్పారు. పాఠశాలలు, వసతిగృహాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకాధికారులను నియమించాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. ఇటీవలి వరదల్లో ప్రాణనష్టం లేకుండా కృషి చేసిన కలెక్టర్లు, అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అభినందించారు.
సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలు