Crop Damage in Telangana: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఎవరూ ధైర్యం కోల్పోవద్దని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు.. రైతులకు భరోసానిచ్చారు. తడిసిన ప్రతిగింజా కొంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి.. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
Hari Rao on Wet Paddy procurement : ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని జిల్లా అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. తీవ్రంగా నష్టపోయి ఆవేదనలో ఉన్న రైతులతో ఆయన మాట్లాడారు. వ్యవసాయాన్ని కాపాడుకుంటూ.. రైతుల కష్టాల్లో భాగస్వామ్యం అవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని హరీశ్‌రావు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
Farmers suffering on crop loss: కేంద్ర ప్రభుత్వము వరి ధాన్యానికి మద్దతు ధర ఇచ్చిన ఇవ్వకపోయినా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతులను కడుపులో పెట్టి చూసుకుంటామని భరోసా ఇచ్చారు. కరీంనగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వరి ధాన్యం మార్చరైజ్ రాకున్నప్పటికీ రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. బీజేపీ నాయకులు రైతులను మభ్య పెట్టేందుకు పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు.
ఆందోళన, అధైర్యపడాల్సిన అవసరం లేదు: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అకాల వర్షాలతో తడిచిన ధాన్యం కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ సర్ధార్ రవీందర్‌సింగ్ అన్నారు. ఈ విషయంలో రైతాంగం ఏ మాత్రం ఆందోళన, ఆధైర్యపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అకాల వర్షాలపై ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. ధాన్యం కొనుగోలు, తరలింపు, తడిసిన ధాన్యం తదితర అంశాలపై చర్చించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం రైతాంగంపై ఏ మాత్రం పడకుండా జగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.