Telangana Leaders focus on Assembly : దిల్లీ కంటే రాష్ట్రంలో రాజకీయ పదవులే బాగుంటాయని ప్రధాన పార్టీల ఎంపీలు పలువురు ఆసక్తి చూపుతున్నారు. పార్లమెంటును కాదని శాసనసభపైనే మక్కువ చూపుతున్నారు. లోక్‌సభ కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు రానుండటం, రాష్ట్రంలోనైతే కీలక పదవులు పొందవచ్చని కొందరు, ఎంపీ అయితే ప్రతి కార్యక్రమానికీ ఎమ్మెల్యేల మీద ఆధారపడి ఉండాల్సి వస్తోందని, ఏ నియోజకవర్గం తమది కాకుండా పోతోందని మరికొందరు.. ఇలా పలు కారణాలతో ప్రయత్నాలు చేస్తున్నారు.
Telangana Leaders focus on Assembly Elections : ఈ ఏడాదిలోనే శాసనసభకు ఎన్నికలు రానుండటంతో ఎంపీల ప్రయత్నాలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. మూడు ప్రధాన పార్టీల్లోనూ ఈ పరిస్థితి ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ముగ్గురు గెలుపొందగా.. వారంతా శాసనసభ ఎన్నికల్లో పోటీచేసేందుకు రంగం సిద్ధంచేసుకుంటున్నారు. బీజేపీలో నలుగురు ఉండగా.. ముగ్గురి పేర్లు ఈ జాబితాలో వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌లోని తొమ్మది మందిలో కొందరు ఇలాంటి ప్రయత్నాల్లో ఉన్నారు. కొందరు రాజ్యసభ సభ్యులూ శాసనసభపై కన్నేశారు. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం ఉంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లాలోనూ ప్రస్తుతం ఎంపీలు అంగీకరిస్తే వారికి గానీ, వారి వారసులకు గానీ ఎమ్మెల్యే స్థానాల్లో అవకాశం కల్పించవచ్చంటున్నారు. దానికి ప్రతిగా ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు భారాస అవకాశం కల్పించే వీలుందని చెబుతున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సైతం ఎమ్మెల్యేగా పోటీ చేసే విషయంలో ఆసక్తితో ఉన్నట్లు చర్చ నడుస్తోంది.
కాంగ్రెస్‌లో.. కాంగ్రెస్‌లో అసంతృప్త నేతగా ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ నుంచి శాసనసభకు పోటీచేస్తానని ఇప్పటికే ప్రకటించారు. గత శాసనసభ ఎన్నికల్లో నల్గొండ సెగ్మెంట్ నుంచి ఓడిపోయిన ఈయన తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి గెలుపొందారు. అయితే రానున్న రోజుల్లో ఈయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? వేరే పార్టీలోకి వెళ్తారా? అన్నది తేలాల్సిఉంది. నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ దిశగా ప్రకటనలు కూడా వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి గెలుపొందిన ఈయన తర్వాత నల్గొండ ఎంపీగా గెలిచి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో ఇక్కడ తెరాస గెలిచింది. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి సైతం మరోసారి కొడంగల్ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్‌లో.. బీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక నుంచి అసెంబ్లీకి పోటీచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ కలియతిరుగుతున్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత రెండోసారి పోటీకి సుముఖంగా ఉంటూనే.. ములుగు నుంచి శాసనసభ బరిలో నిలిచేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె ఇక్కడ ఎక్కువగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వరంగల్ ఎంపీ దయాకర్ కూడా శాసనసభ స్థానంపై ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బీజేపీలో.. కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ లేదా వేములవాడ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇటీవలి కాలంలో వేములవాడ నియోజకవర్గంలో ఆయన ఎక్కువగా పర్యటిస్తుండటం దీనికి సంకేతంగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బోథ్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌పై దృష్టి సారించినట్లు చర్చ నడుస్తోంది.
ఇవీ చదవండి :ఖైదీల 'బ్యాండ్ బాజా బరాత్'.. పెళ్లిళ్లకు మేళతాళాలు వారివే!