తెలంగాణ

telangana

ETV Bharat / state

బండి సంజయ్ రిమాండ్ పిటిషన్‌.. విచారణ ఈనెల 10కి వాయిదా

Bandi Sanjay Remand Petition: పార్లమెంటు సమావేశాలు, ఈనెల 8న ప్రధాని పర్యటనకు హాజరయ్యేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న బండి సంజయ్‌ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. రిమాండ్ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌లో బెయిల్ ఎలా ఇవ్వగలమని.. వేరే పిటిషన్ వేసుకోవచ్చునని తెలిపింది. ప్రశ్నపత్రం కేసులో ఆయనపై నిర్దిష్ట అభియోగాలు లేవు కదా అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. బండి సంజయ్‌ పిటిషన్‌పై కౌంటర్లు వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. ఈనెల 10న విచారణ చేపడతామని తెలిపింది.

bandi arrested
bandi arrested

By

Published : Apr 6, 2023, 8:09 PM IST

Bandi Sanjay Remand Petition: ఈనెల 19 వరకు రిమాండ్ విధిస్తూ హనుకొండ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్‌కు అంగీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మధ్యాహ్నం అత్యవసర విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అక్రమంగా అరెస్టు చేశారని.. సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని పిటిషన్‌లో బండి సంజయ్ పేర్కొన్నారు. కిలోమీటర్ల మేర వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ శారీరకంగా మానసికంగా వేధించారని.. పోలీసుల దాడిలో కాలికి, చేతికి గాయాలు కూడా అయ్యాయని పిటిషన్‌లో వివరించారు.

ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతున్నందునే అక్రమంగా కేసులో ఇరికించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నెల 8న ప్రధాని పర్యటన నేపథ్యంలో అక్రమంగా అరెస్టు చేశారన్నారు. అరెస్టు విషయం లోక్​సభ స్పీకర్​కు సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. శాంతి భద్రతల సమస్య సృష్టించి బీజేపీపై దుష్ప్రచారం చేసే ఉద్దేశంతో పోలీసులు బీఆర్​ఎస్​ ప్రోద్భలంతో వ్యవహరిస్తున్నారని బండి సంజయ్​ పిటిషన్​లో పేర్కొన్నారు.

బండి సంజయ్‌ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్​. రామచంద్రరావు వాదించారు. పోలీసులు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారని.. రిమాండ్ రద్దు చేయాలని న్యాయవాది కోరారు. పార్లమెంటు సమావేశాలు, ఈనెల 8న ప్రధాని పర్యటనలో పాల్గొనేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. రిమాండ్ రద్దు చేయాలన్న పిటిషన్‌లో బెయిల్ ఎలా ఇవ్వగలమని హైకోర్టు ప్రశ్నించింది. ప్రత్యేకంగా వేరే బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చునని.. అవసరమైతే హౌజ్ మోషన్ వేయవచ్చని కోర్టు తెలిపింది.

ప్రశ్నపత్రాలు బయటకు రావడం వెనక ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే భారీ కుట్ర ఉందని.. బండి సంజయ్ ప్రమేయంపై ఆధారాలున్నాయని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. ఎఫ్‌ఐఆర్‌లో బండి సంజయ్‌పై నిర్దిష్ట అభియోగాలేమీ లేవు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆయన ప్రమేయంపై ఎలక్ట్రానిక్ ఆధారాలు ఉన్నాయని తెలిపారు. బండి సంజయ్​ మొబైల్ ఫోన్ ఇవ్వడం లేదన్నారు. బాధ్యతాయుత ఎంపీగా ఉండి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఇతరులకు షేర్ చేశారన్నారు.

ఇతరులకు పంపిస్తే తప్పేంటి: పబ్లిక్ డొమైన్​లో ఉన్న సమాచారాన్ని ప్రతిపక్ష నేతగా ఇతరులకు పంపిస్తే తప్పేంటని హైకోర్టు అడిగింది. పరీక్షలను దెబ్బతీసేందుకు ఇతర నిందితులను బండి సంజయ్ ప్రోత్సహించారని ఏజీ వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వంతో పాటు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రధానోపాధ్యాయుడికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 10న మధ్యాహ్నం మూడున్నరకు విచారణ చేపడతామని.. ఈలోగా బండి సంజయ్​కి బెయిల్ పిటిషన్ వేసుకొనే స్వేచ్ఛ ఉంటుందని హైకోర్టు తెలిపింది.

హెబియస్​కార్పస్ పిటిషన్​పై నాలుగు వాారాలు వాయిదా: బండి సంజయ్‌ ని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారంటూ బీజేపీ నాయకులు వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై స్పందించాలని ప్రభుత్వానికి, పోలీసులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బుధవారం హౌజ్ మోషన్ విచారణకు హైకోర్టు నిరాకరించడంతో ఇవాళ విచారణ జరపాలని ఉదయం జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ పుల్లా కార్తీక్ ధర్మాసనం వద్ద బీజేపీ తరఫు న్యాయవాదులు కోరారు. అంగీకరించిన ధర్మాసనం మధ్యాహ్నం విచారణ జరిపింది. పోలీసులు కోర్టులో హాజరు పరిచినప్పటికీ.. నిర్బంధించిన తీరుపై విచారణ జరపాలని న్యాయవాదులు కోరారు. హైకోర్టు విచారణను నాలుగు వారాలు వాయిదా వేస్తూ.. వారికి నోటీసులు జారీ చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details