తెలంగాణ

telangana

ETV Bharat / state

4 వారాల్లో ఐటీసీకి సొమ్మును చెల్లించండి: హైకోర్టు - తెలంగాణ తాజా వార్తలు

ఐటీసీ సంస్థకు నాలుగు వారాల్లో 12 శాతం వడ్డీతో డిపాజిట్​ సొమ్మును చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. భద్రాచలం సమీపంలోని సారపాకలో కంపెనీ విస్తరణ కోసం 2005లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి ఐటీసీ మధ్య కుదిరిన ఒప్పందంపై హైకోర్టు ఈమేరకు తీర్పు ఇచ్చింది.

TELANGANA HIGH COURT
4 వారాల్లో ఐటీసీకి సొమ్మును చెల్లించండి: హైకోర్టు

By

Published : Feb 6, 2021, 5:44 AM IST

ప్రాజెక్టు విస్తరణ కోసం భూమి కేటాయించనందున.. ఐటీసీ సంస్థకు నాలుగున్నర కోట్ల రూపాయలను 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఏపీఐఐసీ, టీఎస్ఐఐసీలకు హైకోర్టు ఆదేశించింది. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీఐఐసీ, టీఎస్ఐఐసీ 58.31 నిష్పత్తిలో వాటా చెల్లించాలని స్పష్టం చేసింది.

భద్రాచలం సమీపంలోని సారపాక గ్రామంలో పేపర్ బోర్డుల తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్న ఐటీసీ సంస్థ.. కంపెనీ విస్తరణ కోసం భూమిని కేటాయించాలని 2005లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పాల్వంచలోని 445 హెక్టార్ల భూమిని కేటాయించాలని.. ప్రతిఫలంగా అనంతపురం జిల్లా పెద్దమ్మవారిపల్లిలో 1,576 ఎకరాలను అభివృద్ధి చేస్తామని చెప్పింది.

ప్రాజెక్టులో భాగంగా ఐటీసీ సంస్థ 2007లో నాలుగున్నర కోట్ల రూపాయలను ఏపీఐఐసీ వద్ద డిపాజిట్ చేసింది. అయితే ఆ భూమిలో అటవీ శాఖ పరిధిలో ఉన్నందున ఇవ్వలేమని 2012లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భూములు కేటాయించక పోవడం వల్ల డిపాజిట్ చేసిన సొమ్ము తిరిగి ఇవ్వాలని ఐటీసీ హైకోర్టును ఆశ్రయించింది.

ఐటీసీ పిటిషన్​పై జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.అమర్​నాథ్​గౌడ్ ధర్మాసనం విచారణ జరిపింది. భూమి తెలంగాణలో ఉన్నందున తమకు సంబంధం లేదని ఏపీఐఐసీ.. నాలుగున్నర కోట్లు అనంతపురం కలెక్టర్ వద్ద డిపాజిట్ అయినందున తమకు సంబంధం లేదని టీఎస్ఐఐసీ వాదించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఏపీఐఐసీ, టీఎస్ఐఐసీ రెండూ పునర్విభజన చట్టం ప్రకారం 4 వారాల్లో వాటాలను చెల్లించాలని స్పష్టం చేసింది.

ఇవీచూడండి:శనివారం రాష్ట్ర పర్యటనకు కేంద్రమంత్రి అనురాగ్​ సింగ్​ ఠాకూర్​

ABOUT THE AUTHOR

...view details