కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై విచారణ చేసింది. కరోనాపై హైకోర్టుకు ప్రజారోగ్య సంచాలకులు నివేదిక సమర్పించారు. మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. నిపుణుల సలహా కమిటీ భేటీ ఇంకా జరగలేదని ఏజీ ప్రసాద్ వెల్లడించారు. కరోనా మందులను అత్యవసర జాబితాలో చేర్చే ప్రక్రియ జరుగుతోందని ఏఎస్‌జీ పేర్కొన్నారు.
నివేదిక పరిశీలించిన హైకోర్టు ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్ వేచి చూడదంటూ వ్యాఖ్యానించింది. మూడో దశ ముప్పు ముంచుకొస్తోందన్న హెచ్చరికలు ఉన్నాయని గుర్తు చేసింది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కేసులు పెరుగుతున్నాయని వెల్లడించింది.
"ఇప్పటికే కరోనాతో అనేక మంది చనిపోయారు. గత అనుభవాలతో అయినా ఆ నష్టాన్ని నివారించాలి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వాలు ప్రజల పట్ల మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. మేం ఆదేశించినా నిపుణుల కమిటీ భేటీ నిర్వహించలేదు. దానిలోనే నిర్లక్ష్యం కనిపిస్తోంది. జనగామ, కామారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఒక శాతానికి మించి ఉంది. ఆర్టీపీసీఆర్ పరీక్షల పాజిటివిటీ రేటు వెంటనే సమర్పించండి.
-హైకోర్టు
వారంలో మూడో దశ ఎదుర్కొనే ప్రణాళిక రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. వారంలో నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించాలని మరోసారి స్పష్టం చేసింది. పిల్లల చికిత్సకు తీసుకున్న వివరాలు, పడకలు, వసతుల వివరాలు సమర్పించాలని కోరింది. తమ ఆదేశాలు అమలు కాకపోతే డీహెచ్ హాజరుకావాలంది. ఆదేశాలు అమలు కాకపోతే కేంద్ర నోడల్ అధికారి వచ్చి... ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆదేశాల అమలుపై డీహెచ్, కేంద్ర నోడల్ అధికారి ఇద్దరూ వివరణ ఇవ్వాలంది. కరోనా పరిస్థితులపై తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.
ఇదీ చూడండి:Nipah Virus: నిఫా వైరస్ పరీక్షల్లో ఆ 30 మందికి నెగెటివ్