తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల - హైదరాబాద్​లో కరోనా కలకలం

కరోనా సోకిన యువకుడి ఆరోగ్య పరిస్థితి ప్రసుత్తం నిలకడగా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. ఈ విషయమై కేంద్రానికి సమాచారమిచ్చామన్నారు. ఇక్కడ వాతావరణ పరిస్థితి దృష్ట్యా కరోనా వ్యాప్తి చెందే అవకాశం లేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈటల రాజేందర్​ సూచించారు.

eetala rajender
కరోనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల

By

Published : Mar 2, 2020, 8:03 PM IST

కరోనా కేసు విషయమై కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ వెల్లడించారు. కరోనా సోకిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. వైద్య పరీక్షల కోసం గాంధీ, చెస్ట్‌, ఫీవర్‌ ఆస్పత్రుల్లో 40 పడకల చొప్పున ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

కరోనా ఎలా వచ్చింది..

బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఫిబ్రవరి 15న దుబాయ్‌ వెళ్లినట్లు ఈటల తెలిపారు. కంపెనీ పని నిమిత్తం దుబాయ్‌ వెళ్లి అక్కడి సిబ్బందితో కలిసి పనిచేసినట్లు పేర్కొన్నారు. తిరిగి బెంగళూరు.. అక్కడి నుంచి హైదరాబాద్‌ వచ్చారన్నారు. జ్వరం రావటంతో హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారని.. తగ్గకపోవడం వల్ల గాంధీ ఆస్పత్రిలో చేరి వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు మంత్రి ఈటల వెల్లడించారు. నమూనాలు సేకరించి పుణెకు పంపితే కరోనా ఉన్నట్లు తేలిందన్నారు.

యువకుడి కుటుంబసభ్యులు, సహచరుల వివరాలు తీసుకున్నామని, అతను ప్రయాణించిన బస్సులో 27 మంది ప్రయాణించినట్లు తెలిసిందన్నారు. వారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఆస్పత్రిలో యువకుడికి చికిత్స అందించిన సిబ్బంది వివరాలు తీసుకున్నామన్నారు. యువకుడు తన కుటుంబ సభ్యులతో 5 రోజులు గడిపారన్నారు.

వ్యాప్తి చెందే అవకాశం లేదు..

ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి వచ్చిన వారికే కోవిడ్​-19 సోకిందని తెలిపారు. ఇక్కడ ఉన్నవారెవరికి కరోనా వచ్చే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఇక్కడ వాతావరణ పరిస్థితి దృష్ట్యా కరోనా వ్యాప్తి చెందే అవకాశం లేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈటల రాజేందర్​ సూచించారు.

కరోనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల

ఇవీచూడండి:హైదరాబాద్‌, దిల్లీలో కరోనా కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details