తెలంగాణ

telangana

ETV Bharat / state

Grade system in Telangana Intermediate : ఇంటర్‌లోనూ గ్రేడ్లు ఇద్దామా ? - ఇంటర్​లోనూ గ్రేడ్లు ఇచ్చే యోచనలో ప్రభుత్వం

Grade system in Telangana Intermediate : పది తరహాలోనే ఇంటర్​లోనూ మార్కులకు బదులు గ్రేడ్లు ఇవ్వడంపై రాష్ట్ర సర్కార్​ యోచిస్తోంది. నేటి ఆధునిక కాలంలో మార్కుల పోటీతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో ఈ విధానం ద్వారా కొంతమేర అయినా ఫలితం ఉంటుందేమోనని భావిస్తోంది. సాధ్యాసాధ్యాలపై కమిటీని నియమించే యోచనలో సర్కార్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

Inter
Inter

By

Published : May 11, 2023, 10:05 AM IST

Grade system in Telangana Intermediate : తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి తరహాలోనే ఇంటర్‌లోనూ మార్కులకు బదులు గ్రేడ్లు ఇస్తే ఎలా ఉంటుందని యోచిస్తోంది. ఇంటర్మీడియట్​లో మార్కుల పోటీతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి ఉండడం... దాంతో పలువురు ఆత్మహత్యకు పాల్పడుతున్న నేపథ్యంలో గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌(జీపీఏ) ఇస్తే కొంతవరకైనా మానసిక ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

జేఈఈ మెయిన్‌, నీట్‌ ర్యాంకుల్లో కొన్నేళ్ల నుంచి ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ లేదు. ఈసారి నుంచి ఎంసెట్‌కూ శాశ్వతంగా వెయిటేజీ తొలగించారు. ఈ క్రమంలో ఇంటర్‌లో మార్కుల బదులు గ్రేడ్లు ఇస్తే మన విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఏమైనా సమస్య వస్తుందా? తదితర పలు అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు నిపుణుల కమిటీని నియమించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది.

కమిటీ వేస్తే పరిష్కారం లభ్యం :దీనిపై ఇంటర్‌ విద్య ఐకాస ఛైర్మన్‌ డాక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ ప్రవేశ పరీక్షల్లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ లేదని చెప్పారు. ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో చేరేటప్పుడు కనీసం 75% మార్కులు అడుగుతారని, అలాంటప్పుడు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మధుసూదన్​రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దోస్త్‌ ద్వారా డిగ్రీ ప్రవేశాలకూ ఇంటర్‌ మార్కులే ఆధారంగా ఉన్నందున నిపుణుల కమిటీ వేస్తే ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని ఇంటర్‌ విద్య ఐకాస ఛైర్మన్‌ తెలిపారు. ‘ఇప్పుడు ఇంటర్‌ మార్కుల కంటే జేఈఈ, నీట్‌ ర్యాంకులు వస్తాయో? రావో? అన్న దానిపైనే అధికంగా ఒత్తిడి ఉంది’ అని నానో అకాడమీ సంచాలకుడు కృష్ణ చైతన్య అభిప్రాయపడ్డారు.

నేడు దోస్త్ షెడ్యూల్‌ విడుదల :మరోవైపు డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కళాశాల విద్య కార్యదర్శి నవీన్ మిత్తల్... దోస్త్ షెడ్యూలును ప్రకటించనున్నారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన, మహిళా విశ్వవిద్యాలయాల పరిధిలోని సుమారు 1100 కాలేజీల్లో దాదాపు నాలుగున్నర లక్షల బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర సంప్రదాయ డిగ్రీ సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. మూడు విడతల్లో డిగ్రీ సీట్లు భర్తీ చేస్తారు.

‘పది’లోనూ ఆన్‌లైన్‌ మూల్యాంకనం :పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో కూడా ఆన్‌లైన్‌ విధానాన్ని (ఆన్‌ స్క్రీన్‌ ఎవాల్యుయేషన్‌) అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఆలోచన చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన వెల్లడించారు. అదనపు జవాబుపత్రాలు తీసుకుంటే ఇంటర్‌ తరహాలో బుక్‌లెట్‌గా ఇవ్వాలని, ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయాలంటే అది తప్పనిసరని అన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details