Telangana Govt Focus on Rabi Season Cultivation :రాష్ట్రంలో యాసంగిలో పంటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈ ఏడాది యాసంగి సీజన్ మొదలైనప్పటి నుంచి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం సాగు వేగం కొంత వరకు ఆశాజనంగా కనిపిస్తోంది. నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల జిల్లాల్లో లోటు వర్షపాతం కొనసాగుతోంది. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, కరీంనగర్, మహబూబాబాద్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జనగామ, సంగారెడ్డి, ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, సూర్యాపేట తదితర 23 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
Rabi Season Cultivation in Telangana 2023 : నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి వంటి 8 జిల్లాల్లో అదనపు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో 54 లక్షల 93 వేల 444 వేల ఎకరాల్లో పంట వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ప్రాజెక్టులు, సాగు నీటి వనరులు పుష్కలంగా ఉన్నందున వరి సాగు విస్తీర్ణం 40 లక్షల 50 వేల 785 ఎకరాల్లో సాగు చేయాలన్నది లక్ష్యం. అందుకు అనుగుణంగా ఇప్పటికే పలు జిల్లాల్లో వానాకాలం వరి కోతలు పూర్తవుతుండగా, చాలా చోట్ల కల్లాల్లో ధాన్యం రాశులు పోశారు. మరికొన్ని గ్రామాల్లో యాసంగి వరి నార్లు పోసుకొని నాట్లు వేయడానికి రైతులు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచె తొలగింపు - నేడు ప్రజా దర్బార్ నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి
యాసంగిలో ఇవాళ్టి వరకు 19 వేల 613 ఎకరాల విస్తీర్ణంలో అంటే 0.48 శాతం మేర వరి నాట్లు పడ్డాయి. వరి మినహా జొన్న, సజ్జ, మొక్కజొన్న, కొర్ర, గోధుమ వంటి ఇతర చిరు ధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 6 లక్షల 30 వేల 810 ఎకరాలు ఉండగా, ఇప్పటి వరకు 1 లక్షా 58 వేల 249 ఎకరాల్లో విత్తుకున్నారు. మొక్కజొన్న పంట ఏకంగా లక్ష 5 వేల ఎకరాల్లో సాగు మొదలైంది. కంది, వేరుశనగ, పెసర, మినుము, అలసంద, పశు గ్రాసం ఇతర పప్పు ధాన్యాల పంటల సాధారణ సాగు విస్తీర్ణం 4 లక్షల 21 వేల 163 ఎకరాల విస్తీర్ణం నిర్దేశించగా, ఇప్పటి వరకు 2,17,335 ఎకరాల్లో గింజలు విత్తుకోవడంతో అవి మొలకెత్తుతూ వివిధ దశలో ఉన్నాయి.