Telangana Government Letter To NWDA: గోదావరి-కావేరీ అనుసంధానం కోసం ఛత్తీస్‌గఢ్ వాటాలోని 141 టీఎంసీలను వినియోగిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర ప్రాతినిథ్యం లేకుండా చర్చించడం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ నెల 6న హైదరాబాద్ జల సౌధలో ప్రతిపాదించిన టాస్క్ ఫోర్స్ సమావేశానికి ఛత్తీస్‌గఢ్‌ను ఆహ్వానించాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ జాతీయ జలాభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజినీర్‌కు లేఖ రాశారు.
గోదావరి-కావేరీ అనుసంధానానికి సంబంధించి.. తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని గతంలోనే స్పష్టం చేశామని.. అందుకు కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. 6న జరిగే సమావేశానికి ఛత్తీస్‌గఢ్‌ను సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించలేదని లేఖలో పేర్కొన్నారు. అనుసంధానం కోసం ఆ రాష్ట్ర నీటి వాటాను వినియోగించుకుంటూ.. ఆ రాష్ట్రం లేకుండా చర్చలు అర్థవంతం కాదని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఛత్తీస్‌గఢ్‌ను సోమవారం జరిగే సమావేశానికి ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
గతంలోనూ పలుమార్లు తెలంగాణ ప్రభుత్వం జాతీయ జలాభివృద్ధి సంస్థకు పలు అంశాలపై లేఖలు రాసింది. ముఖ్యంగా గోదావరి-కావేరి నదుల అనుసంధానం విషయంలో ఆ సంస్థ తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ ఈఎన్సీ తన అభిప్రాయాలు లేఖల ద్వారా వ్యక్తం చేసింది. 2022 నవంబర్లోను నదుల అనుసంధానం గురించి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అప్పుడు మొదటగా మహానది- గోదావరి నదుల అనుసంధానం పూర్తయ్యాకే గోదావరి-కావేరి లింక్ చేపట్టాలని స్పష్టం చేసింది. అదే విధంగా కొన్ని అంశాలను ప్రభుత్వం ప్రస్తావించింది.