Telangana Letter to CWC on Polavaram Project Survey : పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ ప్రభావంపై సర్వే చేపట్టాలన్న ఆదేశాలపై ప్రాజెక్టు అథారిటీ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని.. తక్షణమే సర్వే చేసేలా చూడాలని కేంద్ర జలసంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు పీపీఏ ఆధర్యంలో ఉమ్మడి సర్వే నిర్వహించాలని.. మూడు సాంకేతిక సమావేశాలతో పాటు సమన్వయ సమావేశంలో నిర్ణయించినట్లు అందులో పేర్కొన్నారు.
బ్యాక్ వాటర్స్, ముంపు ప్రభావానికి సంబంధించి పలు అంశాలను లేఖలో పొందుపరిచారు. పోలవరంలో ఎఫ్ఆర్ఎల్ స్థాయిలో నీటిని నిల్వ చేస్తే.. తెలంగాణలో 954 ఎకరాలు ముంపునకు గురవుతుందన్న అంచనా ఉందని పేర్కొన్నారు. దీనిపై పీపీఏ వాస్తవాలు నిర్ధారించుకొని ట్రైబ్యునల్ తీర్పునకు అనుగుణంగా రక్షణ చర్యలు చేపట్టాలని కోరింది. కిన్నెరసాని, ముర్రేడువాగుల నుంచి డ్రైనేజీ ప్రవాహానికి సంబంధించి సీడబ్ల్యూసీ 2021 జూన్‌లోనే నివేదిక ఇచ్చిందని.. అందుకనుగుణంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి సర్వే చేపట్టాలి:దీంతో పాటు దుమ్ముగూడెం.. ఆనికట్ దిగువన గోదావరిలో కలిసే ఏడు స్థానిక ప్రవాహాల కారణంగా ఉత్పన్నమయ్యే ముంపును గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీనితోపాటు ఇతర 30 ప్రవాహాలకు కూడా ఇదే కసరత్తు చేయాలని తెలిపింది. భద్రాచలం పట్టణం, మణుగూరు భారజల కేంద్రానికి సంబంధించి ఇంపార్టెంట్ లెవెల్స్‌ను తనిఖీ చేసేందుకు.. తక్షణమే ఉమ్మడి సర్వే చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.
మరో 25 రోజుల గడువు మాత్రమే ఉంది: ఈ క్రమంలోనే 2010లో ఆమోదించిన డీపీఆర్‌లోని సిఫారసులకు అనుగుణంగా కరకట్టలు నిర్మించేందుకు ఉమ్మడి సర్వే నిర్వహించాలని లేఖలో కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వివరాలు అంది రెండు వారాలు గడచినప్పటికి.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలంగాణ ఆక్షేపించింది. రుతుపవనాల్లోపు సర్వే చేపట్టేందుకు మరో 25 రోజుల గడువు మాత్రమే ఉందని గుర్తు చేసింది.