తెలంగాణ

telangana

ETV Bharat / state

government focus on new variant: ఒమిక్రాన్​పై ప్రభుత్వం అప్రమత్తం.. వారికి పరీక్షలు తప్పనిసరి

Telangana on alert over new COVID variant: కరోనా కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అప్రమత్తతపై దృష్టి సారించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది. నియంత్రణా చర్యలతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ జిల్లాల కలెక్టర్లు, అధికారులకు దిశానిర్ధేశం చేయనుంది.

government focus on new variant: ఒమిక్రాన్​పై ప్రభుత్వం అప్రమత్తం.. వారికి పరీక్షలు తప్పనిసరి
government focus on new variant: ఒమిక్రాన్​పై ప్రభుత్వం అప్రమత్తం.. వారికి పరీక్షలు తప్పనిసరి

By

Published : Dec 1, 2021, 3:57 AM IST

Telangana on alert over new COVID variant: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కరోనా పరిస్థితులు, వైద్య-ఆరోగ్యశాఖ సన్నద్ధతపై సమీక్షించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్, రాష్ట్రంలో పరిస్థితులపై కేబినెట్​కు నివేదించిన వైద్య,ఆరోగ్య శాఖ అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అవసరమైన ఔషధాలు, పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖను కేబినెట్ ఆదేశించింది. అందుకు అనుగుణంగా వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది. పడకలు, ఔషధాలు, పరికరాలతో పాటు మానవవనరులు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్లు తెలిపింది.

విదేశాల నుంచి వచ్చిన వారికి..

ఒమిక్రాన్ వేరియంట్​ను దృష్టిలో ఉంచుకొని విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు తప్పనిసరి చేశారు. పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స కోసం గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసిన ప్రభుత్వం... నెగెటివ్ వచ్చిన వారిని హోంక్వారంటైన్​లో ఉంచి పర్యవేక్షిస్తారు. నియంత్రణా చర్యలను పకడ్బందీగా చేయనున్నారు. అటు కరోనా నియంత్రణా చర్యలతో పాటు వ్యాక్సినేషన్​పై వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. పురపాలక, పంచాయతీరాజ్, విద్యాశాఖల మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డిలను సభ్యులుగా నియమించారు. ఉపసంఘం ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య, విద్య, పురపాలక, పంచాయతీరాజ్ అధికారులతో దృశ్యమాధ్యమం ద్వారా సమావేశం కానుంది. ఆయా జిల్లాల్లో పరిస్థితులతో పాటు వ్యాక్సినేషన్​పై సమీక్షించనున్నారు.

డిసెంబర్​ నెలాఖరు నాటికి..

రాష్ట్రంలో 90శాతానికి పైగా ఒక డోస్ టీకా, 46 శాతం వరకు రెండు డోసుల టీకాలు ఇచ్చారు. డిసెంబర్ నెలాఖరు నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రెండు డోసుల టీకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జిల్లాల్లో పరిస్థితులపై మంత్రులు సమీక్షించాలని సీఎం తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు రెండో డోస్ వ్యాక్సినేషన్​లో వెనకంజలో ఉన్నాయి. ఆయా జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శిని కేబినెట్ సమావేశంలో ఆదేశించారు.

టీకాలపై ప్రత్యేక దృష్టి

ఇవాళ్టి సమావేశంలో టీకాలపై మంత్రివర్గ ఉపసంఘం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. ప్రతి ఒక్కరికీ రెండు డోసుల టీకాలు విధిగా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఆయా శాఖల తరపున నియంత్రణా చర్యలు, ముందు జాగ్రత్త చర్యలపై అధికారులకు మంత్రులు దిశానిర్ధేశం చేయనున్నారు. పారిశుద్ధ్యంతో పాటు విద్యాసంస్థల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు.

ఇదీ చదవండి:

కరోనా వ్యాప్తి​ దృష్ట్యా విద్యాసంస్థల మూసివేతపై మంత్రి స్పష్టత

ABOUT THE AUTHOR

...view details