నదీ జలాల వివాదాల నేపథ్యంలో న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్లలో బలమైన వాదనలు వినిపించడానికి వీలుగా ఆధారాలు సమర్పించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1944 నుంచి ఇప్పటివరకు జరిగిన ఒప్పందాలు, నీటి కేటాయింపులు, హైదరాబాద్ స్టేట్‌లో జారీ అయిన జీవోలు, ఉమ్మడి రాష్ట్రంలోని ఉత్తర్వుల పత్రాలను డిజిటలైజ్ చేయనుంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. కృష్ణా, గోదావరి బోర్డులు, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు ఫిర్యాదులు చేయడంతో పాటు పలు ఆధారాలను సమర్పించాల్సి వస్తోంది. అప్పటికప్పుడు పత్రాలను వెలికితీసి సమర్పిస్తున్నారు. కొన్ని అంశాలకు సంబంధించి ఆధారాలున్నా వాటి ఆచూకీ కనుగొనడం సాధ్యం కావడం లేదు. నీటిపారుదల శాఖలో దాదాపు ఐదు లక్షల పత్రాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కేంద్రం గత నెలలో జారీ చేసిన గెజిట్‌లో 1980 నాటి ప్రాజెక్టులనూ అనుమతి లేని వాటి జాబితాలో చేర్చింది. వాటికి సంబంధించిన పత్రాలనూ సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నీటిపారుదల శాఖకు చెందిన పత్రాలను డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
ఈ అంశంపై గురువారం నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఐటీ నిపుణులు, ఐబీఎం సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి పత్రాలన్నింటినీ డిజిటల్ విధానంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు.