రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల (నిర్మాణాలు, ప్లాట్లు) నమోదు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. తెలంగాణ నాన్ అగ్రిక్చలర్ పాస్‌పుస్తకం (టీఎస్‌ఎన్‌పీబీ) అందించే క్రమంలో భాగంగా జరుగుతున్న ఈ ప్రక్రియలో పురపాలక సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందించిన ప్రత్యేక యాప్ ద్వారా వివరాలను (ఈకేవైసీ) నమోదు చేస్తున్నారు. ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య ఆధారంగా నిర్మాణాలు, ప్లాట్లకు సంబంధించి ఆధార్, ఇతర వివరాలను పొందుపరుస్తున్నారు. దీంతో పాటు యజమానులు కూడా స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే నేరుగా నమోదు చేసుకునేందుకు శుక్రవారం పలువురు ప్రయత్నించగా అదొక క్లిష్టతరమైన సమస్యగా మారింది. ఆస్తిపన్ను రికార్డుల్లోని పేరు, ఆధార్‌లోని పేరులో ఒక అక్షరం తేడా ఉన్నా నమోదు ప్రక్రియ ఆగిపోతుండటంతో గందరగోళానికి గురవుతున్నారు. దీంతో ఆన్‌లైన్‌లో ‘ఈకేవైసీ’ పూర్తి చేయడం పెద్ద ప్రయాసగా మారింది.
మా ప్రాంతానికి ఎప్పుడు వస్తారు?
మూడు రోజులైనా నమోదు ప్రారంభం కాలేదని పలు ప్రాంతాలవారు పేర్కొన్నారు. సర్వేకు ఎవరు? ఎప్పుడు వస్తారు? సిబ్బంది ఇంటికొచ్చినప్పుడు తాము లేకుంటే ఎలా? తర్వాత ఎవరిని, ఎక్కడ సంప్రదించి వివరాలు అందించాలి? ఆస్తుల సర్వే పూర్తి చేసుకునేందుకు తుది గడువుందా? ఇలాంటి సందేహాలతో ఆస్తుల యజమానులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. యజమాని ఇంట్లో లేకుంటే ఫోన్ ద్వారా వివరాలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా.. అలా ఎక్కడో ఉండి చెప్పడం ఎలా సాధ్యమనేది కొందరి సందేహం. కొన్నిచోట్ల ఆస్తుల వివరాలు ఎందుకు చెప్పాలి; ఎన్నిసార్లు ఇవ్వాలి అంటూ యజమానులు బిల్ కలెక్టర్లను ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.