విద్యుత్ సంస్థల రుణాలకు సంబంధించి కేంద్రం తాజా షరతు విధించింది. కొత్త రుణాలతో పాటు, ఇప్పటికే మంజూరైన వాటి నిధులు విడుదల చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వమే నేరుగా రిజర్వుబ్యాంకు (ఆర్‌బీఐ), కేంద్ర ప్రభుత్వంతో ‘త్రైపాక్షిక ఒప్పందం’ చేసుకోవాలని ‘గ్రామీణ విద్యుదీకరణ సంస్థ’ (ఆర్‌ఈసీ) రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసింది.
ఈ ఒప్పందం చేయలేదని తెలంగాణ జెన్‌కోకు ఇప్పటికే రూ.200 కోట్ల దాకా నిధుల విడుదలను ఆర్‌ఈసీ నిలిపివేసింది. దీనివల్ల విద్యుత్కేంద్రాల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుందని జెన్‌కో ఆందోళన చెందుతోంది. ఆర్‌ఈసీ లేఖకు జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఘాటుగా ప్రత్యుత్తరమిచ్చారు. త్రైపాక్షిక ఒప్పందానికి జెన్‌కో అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఆయన రాసిన లేఖలో ముఖ్యాంశాలిలా ఉన్నాయి.
* గతంలో ఒప్పందం చేసుకున్న ప్రకారం యాదాద్రి, కొత్తగూడెం 7వ దశ విద్యుత్కేంద్రాల నిర్మాణం కోసం ఆర్‌ఈసీ రూ.25,652 కోట్ల రుణాలను జెన్‌కోకు మంజూరు చేసింది. ఇందులో రూ.18,690 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది.
* ఈ రుణం కోసం తన స్థిర, చరాస్తులన్నింటినీ ఆర్‌ఈసీకి తాకట్టు పెట్టి జెన్‌కో పూచీకత్తు ఇచ్చింది. జాతీయ బ్యాంకుల నుంచి జెన్‌కో ఎన్నో రుణాలు తీసుకుంటున్నా ఏ బ్యాంకూ ఇలా కఠిన నిబంధనలు విధించి ఆస్తులను తాకట్టు పెట్టుకోలేదు. పైగా ఈ రుణాలను నేరుగా జెన్‌కో బ్యాంకు ఖాతాలో వేయకుండా విద్యుత్కేంద్రాల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక ఖాతా తెరిపించాలనే నిబంధన సైతం ఆర్‌ఈసీ పెట్టింది.
* రుణరాయితీ కిస్తీలను జెన్‌కో పక్కాగా చెల్లిస్తోంది. ఇలా జెన్‌కో పారదర్శకతతో వ్యవహరిస్తున్నా త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటేనే రుణాల మిగిలిన సొమ్ము విడుదల చేస్తామనడం తెలంగాణపై చూపుతున్న వివక్షకు నిదర్శనం. ఇది అసంబద్ధం. గతంలో ఒప్పందం చేసుకున్నప్పుడు ఈ నిబంధన పెట్టనందున అది చెల్లదు.