Telangana Goods Export to America : తెలంగాణలో తయారైన వస్తు సామగ్రిలో అత్యధికం (26.26 శాతం) అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో చైనా (6.78 శాతం), రష్యా (4.01 శాతం) ఉన్నాయి. రాష్ట్రంలో తయారయ్యే ఔషధాలతో పాటు ఆహార, జౌళి ఉత్పత్తులు, వైమానిక విడిభాగాలు అమెరికాకు ఎక్కువ ఎగుమతి అవుతున్నాయి. చైనా సైతం పత్తి, ఖనిజాలు, యంత్ర పరికరాలను దిగుమతి చేసుకుంటోంది. రాష్ట్ర ఎగుమతుల శాఖ తాజాగా విడుదల చేసిన 2020-21 నివేదికలో ఈ అంశాలను నివేదించింది.
2020-21లో తెలంగాణ రూ.2 లక్షల 10 వేల 81 కోట్ల విలువైన సరుకులను విదేశాలకు ఎగుమతి చేసింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో ఇది 21.4 శాతంగా నమోదయింది. ఎగుమతి అయిన వాటిలో 33.41 శాతం ఔషధాలు కాగా.. ఆ తర్వాత సేంద్రియ రసాయనాలు 31.12 శాతం ఉన్నాయి.ఎగుమతుల సంసిద్ధత పరంగా తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలవగా.. అనుకూలతల్లో అయిదో స్థానం పొందినట్లు నివేదిక వెల్లడించింది.
సరళతర అనుమతుల ద్వారా:రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువుల వినియోగంతో పాటు ఎగుమతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. టీఎస్‌ఐపాస్ విధానం తెచ్చి సరళతర అనుమతుల ద్వారా 20 వేలకు పైగా కొత్త పరిశ్రమలు, 56 పారిశ్రామిక పార్కుల ఏర్పాటు అయ్యాయి. ఎగుమతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, రవాణా వసతులు, ఇతర ప్రోత్సాహక చర్యలు చేపట్టడంతో ఎగుమతులు ఏటేటా పెరుగుతున్నాయి. 2019-20తో పోలిస్తే 2020-21లో రూ.30 కోట్లకు పైగా ఎగుమతులు పెరిగాయి. ఎగుమతుల మార్గనిర్దేశం చేసే తొలి 10 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది.
ఔషధ రంగానిదే అగ్రస్థానం:ఔషధ రంగంలో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. దేశంలోని ఔషధ ఉత్పత్తిలో 30 శాతం తెలంగాణలో జరుగుతోంది. దేశం నుంచి జరిగే ఔషధాల ఎగుమతిలో 50 శాతం వాటా రాష్ట్రానిదే. ఆ తర్వాతి స్థానంలో సేంద్రియ రసాయనాలు, మూడో స్థానంలో అణుయంత్రాలు (5.37శాతం), ఎలక్ట్రికల్ యంత్రాలు (4.67 శాతం), లవణాలు, ఖనిజాలు (2.82 శాతం) పత్తి (1.97 శాతం), పప్పు దినుసులు (1.76 శాతం), కాఫీ, టీలు (1.74 శాతం), వైమానిక పరికరాలు (1.04 శాతం), లోహ పరికరాలు (1.03 శాతం)కాగా ఇతర రంగాలవి 15.07 శాతం వస్తువులున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, చిప్‌లు, సౌరవిద్యుత్, వాహన పరికరాలతో పాటు జౌళి ఉత్పత్తులు, బియ్యం, నూనెలు, మామిడి, ద్రాక్ష, నిమ్మ, నారింజ, మొక్కజొన్న, మాంసం, చేపలు, హస్త కళాఖండాలు ఎగుమతుల జాబితాలో ఉన్నాయి.
కొరతను అధిగమించి:తెలంగాణకు సముద్ర తీరం లేదు. కేవలం వైమానిక మార్గాలే హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉన్నాయి. సముద్ర తీరం నుంచి ఎగుమతుల కోసం ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ కొరతను అధిగమించేందుకు బహుళ విధ రవాణా సేవల (మల్టీమోడల్ లాజిస్టిక్స్) పార్కుల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. అంతర్జాతీయ మార్కెట్లలో రాష్ట్ర ఎగుమతులను మరింత పోటీగా మార్చడమే గాకుండా ఎగుమతి ఆధారిత మౌలిక సదుపాయాల కల్పన కోసం చిన్న తరహా లాజిస్టిక్స్ పార్కులపై దృష్టి సారించింది. రహదారులను విస్తరించింది. కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రయత్నాలు చేపట్టింది.
ఎగుమతుల్లో మొదటి ఎనిమిది జిల్లాలు:రాష్ట్రం నుంచి జరిగే ఎగుమతుల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ జిల్లా రెండోస్థానంలో ఉంది. ఔషధ, రసాయన, యంత్ర పరికరాల ఉత్పత్తులు, పారిశ్రామిక పార్కులు ఎక్కువగా ఉండటంతో రాజధాని చుట్టుపక్కల ఉండే జిల్లాలు అగ్రభాగాన ఉన్నాయి.
ఇవీ చదవండి: