తెలంగాణ

telangana

KRMB: హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలు ఏపీ వాడకుండా చూడాలి: తెలంగాణ

By

Published : Aug 28, 2021, 3:59 PM IST

Updated : Aug 28, 2021, 7:04 PM IST

హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలు ఏపీ వాడకుండా చూడాలి: తెలంగాణ
హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలు ఏపీ వాడకుండా చూడాలి: తెలంగాణ

15:55 August 28

హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలు ఏపీ వాడకుండా చూడాలి: తెలంగాణ

  కృష్ణా జలవివాదాల రెండో ట్రైబ్యునల్ నీటివాటాలను తేల్చే వరకు హంద్రీనీవా సుజలస్రవంతి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీరు తీసుకోకుండా నిలువరించాలని తెలంగాణ కోరింది. ఈ మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్​కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం శ్రీశైలం జలాశయం జలవిద్యుత్​కు ఉద్దేశించినదేనని.. అక్కణ్నుంచి కృష్ణా బేసిన్ వెలుపలకు నీటి తరలింపునకు ట్రైబ్యునల్ అనుమతించలేదని పేర్కొన్నారు. వరదజలాలపై ఆధారపడి నిర్మించిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కృష్ణా బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తోందని అన్నారు. దీంతో బేసిన్​లోని తెలంగాణ ప్రాజెక్టులు నష్టపోతాయని.. నది ఒడ్డునున్న తెలంగాణ ప్రాంతాలను కాదని బేసిన్ వెలుపల 700 కిలోమీటర్ల దూరానికి నీటిని తరలించడం అన్యాయమని లేఖలో పేర్కొన్నారు.  

  హంద్రీనీవా సుజలస్రవంతి నుంచి తుంగభద్ర హైలెవల్ కెనాల్ తదితర ప్రాజెక్టులకు బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తున్నందున బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కేటాయింపులు కూడా చేయలేదని గుర్తు చేశారు. అలా నీటిని తరలించడం ట్రైబ్యునల్ తీర్పుకు వ్యతిరేకమని అన్నారు. మిగులు జలాలపై ఆధారపడి బేసిన్ వెలుపలకు నీటిని తీసుకెళ్లే హంద్రీనీవా ప్రాజెక్టునే తాము వ్యతిరేకిస్తోంటే సామర్థ్యాన్ని 3850 నుంచి 6300 క్యూసెక్కులకు పెంచడం అక్రమమని తెలంగాణ ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు. వరదజలాలపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలని తెలంగాణ కోరుతోందని, ఆంధ్రప్రదేశ్ మాత్రం విజ్ఞప్తి చేయడం లేదని అన్నారు. వీటన్నింటి నేపథ్యంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వాటాలు ఖరారు చేసే వరకు హంద్రీనీవా నుంచి నీటిని తరలించకుండా ఆంధ్రప్రదేశ్​ను నిలువరించాలని కోరారు. 

ఇదీ చదవండి: KRISHNA BOARD : నోడల్‌ ఏజెన్సీగా కృష్ణా బోర్డును నియమిస్తూ ఉత్తర్వులిచ్చిన ఎన్జీటీ

Last Updated : Aug 28, 2021, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details