Telangana Election Code Police Checks 2023 :రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన మరుక్షణం పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు (Election Checks) ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రభావాన్ని తగ్గించి.. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టకుండా చేయడమే సోదాల ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో శనివారం వరకు తెలంగాణ వ్యాప్తంగా రూ.377 కోట్ల సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓవైపు చెప్పుకోవడానికి నంబర్ చూస్తే గొప్పగానే ఉన్నా.. ఇందులో ఏ రాజకీయనేతకు సంబంధించి ఒక్క పైసా లేకపోవడం విశేషం.
Police Checks in Telangana During Election Code 2023 :మరోవైపు వీటిలో పట్టుబడిన మొత్తం సామాన్య ప్రజలు, వ్యాపారులదే కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లెక్కలు ఘనంగా చెప్పుకోవడానికే తనిఖీలు చేస్తున్నట్లుగా ఉందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. తగిన పత్రాలు చూపినా ఏదోక చిన్న కారణం చూపి డబ్బు, నగలు స్వాధీనం (Seized) చేసుకుంటున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
ఆదాయపన్నుశాఖ లెక్కల్లో రూ.2 కోట్లే..వాస్తవానికి సరైన ఆధారాలు చూపని సొత్తును మాత్రమే స్వాధీనం చేసుకోవాలి. రూ.50,000 మించి నగదు తీసుకెళ్తుంటే ఎక్కడ డ్రా చేసుకున్నారు, ఎవరి ఖాతా నుంచి డ్రా చేశారు వంటి వివరాలు ఉంటే సరిపోతుంది. నగలకు సంబంధించి వాటి కొనుగోలు రశీదులు చూపించాలి. ఇవన్నీ చూపించినా స్వాధీనం చేసుకుంటుండటం విమర్శలకు దారితీస్తోంది. అన్ని ఆధారాలు ఉంటే 24 గంటల్లోనే తిరిగి ఇచ్చేస్తున్నామని చెబుతున్నా.. ఆ ప్రక్రియ మొత్తం పూర్తి చేయడానికి సామాన్యులు నానాపాట్లు పడుతున్నారు.
Huge Amount of Money Seized in Telangana Election Code 2023 :ఈ నెల 9న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అప్పటి నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రంలో రూ.136.09 కోట్ల నగదు, రూ.18.18 కోట్ల మాదకద్రవ్యాలు, రూ.162.07 కోట్ల బంగారు ఆభరణాలు, రూ.28.84 కోట్ల విలువైన మద్యం, రూ.32.49 కోట్ల విలువైన వస్తు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందులో ఆదాయపన్నుశాఖ వారి లెక్కల ప్రకారం పట్టుబడిన నగదులో లెక్కలు చూపనిది రూ.2 కోట్లు మాత్రమేనని అధికారులు తెలిపారు.