Capital Income of Telangana 2022-23 : తెలంగాణ రాష్ట్ర వార్షిక (2022-23) తలసరి ఆదాయం రూ.3,08,732 అని రాష్ట్ర ఆర్థికాభివృద్ధి నివేదిక తెలిపింది. రాష్ట్ర అర్ధ, గణాంక శాఖ రూపొందించిన ఈ నివేదికను జూన్ 17న ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో దేశంలోని 16 రాష్ట్రాల వార్షిక తలసరి ఆదాయాల వివరాలను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం గత సంవత్సరం రూ.2.19 లక్షలని తెలిపింది. జాతీయ తలసరి ఆదాయం రూ.1.72 లక్షలని.. దాని కన్నా 1.8 రెట్లు ఎక్కువగా రాష్ట్రంలో ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రం ఏర్పడిన వార్షిక సంవత్సరంలో అంటే 2014-2015లో తలసరి ఆదాయంలో రాష్ట్రం దేశంలో పదో స్థానాన ఉందని.. ఇప్పుడు మొదటి స్థానానికి చేరిందని వివరించింది. 2014-23 మధ్య కాలంలో తలసరి ఆదాయం సగటు వృద్ధి రేటు 12.1 శాతం నమోదుతో దక్షిణ భారత రాష్ట్రాల్లో తొలి స్థానాన్ని దక్కించుకున్నట్లు తెలిపింది.
ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో మరికొన్ని అంశాలు..:
- ప్రస్తుత ధరల ప్రకారం.. జీఎస్‌డీపీలో వ్యవసాయ, అటవీ, మత్స్య, పశు సంపదలు ఉన్న ప్రాథమిక రంగం వాటా 21.1 శాతానికి చేరింది. 2014-23 మధ్యకాలంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వార్షిక సగటు వృద్ధి రేటు ప్రస్తుత ధరల్లో 12.8 శాతం.
- రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ) రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014-15లో రూ.5.05 లక్షలు. అది 2022-23 నాటికి రూ.12.93 లక్షలు దాటింది.
- ద్వితీయ రంగం వాటా జీఎస్‌డీపీలో 21.2 శాతానికి చేరింది.
- తృతీయ రంగం వాటా 62.2 శాతం. మొత్తం విలువ రూ.7.22 లక్షల కోట్లను మించిపోయింది. దీనిలో ఎక్కువగా ఆస్తుల యాజమాన్యం, రియల్ ఎస్టేట్‌ల విలువ రూ.2.49 లక్షల కోట్లకు పైగా నమోదైంది. వీటిలో వాణిజ్యం, రెస్టారెంట్లు, హోటళ్లు వంటి వాటి విలువ రూ.2.16 లక్షల కోట్లకు పైగా నమోదైంది.
- జీఎస్‌డీపీలో ప్రాథమిక రంగం మొత్తం విలువ గత సంవత్సరం రూ.2.17 లక్షల కోట్లుంటే.. అందులో పంటల ఉత్పత్తుల వాటా రూ.1.08 లక్షల కోట్లు.