EC Focus on Candidates Expenditure in Telangana Elections :ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వ్యయంపై మరింత దృష్టి పెట్టేందుకు ప్రత్యేక సాంకేతికతను జోడించాలనికేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ఎన్నికల వ్యయంపై నిఘాను మరింత విస్తృతం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అభ్యర్థుల ఖర్చుల వివరాలను రహస్య పరిశీలన రిజిస్టర్ (షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్) పేరుతో ఎన్నికల సంఘం నమోదు చేస్తుంది.
Telangana Assembly Elections 2023 :ఇందుకోసం ప్రస్తుతం అభ్యర్థుల ఖర్చుల పర్యవేక్షణ వ్యవస్థ (క్యాండిడేట్ ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్ సిస్టం) పేరిట ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఎలక్షన్ కమిషన్ సిద్ధం చేసింది. త్వరలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ అభ్యర్థులు చేసే ఖర్చులపై దృష్టి పెట్టేందుకు ఈ సాఫ్ట్‌వేర్ వినియోగించాలని ఈసీ నిర్ణయించింది. ఈ సాంకేతికతను మరింత పటిష్ఠం చేసేందుకు గానూ సూచనలను అందించాలని ఈ మేరకు ఆయా రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులను కోరింది. వారు సూచించిన మార్పులతో సాఫ్ట్‌వేర్‌కు తుదిరూపు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
పది విభాగాలుగా వ్యయం :ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను అభ్యర్థులు నిర్ధారిత వ్యవధుల్లో ఎలక్షన్ కమిషన్ అధికారులకు అందజేస్తారు. ఆ పేపర్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో తనిఖీలు చేయటం ప్రహసనమేనని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఈ క్రమంలో నిఘాను పెంచేందుకు ప్రచార వ్యయాన్ని 10 విభాగాలుగా కేంద్ర ఎన్నికల సంఘం విభజించింది. అలాగే ఆ విభాగాల పరిధిలో 50 అంశాలను పొందుపరిచింది. భారీ సభల నుంచి పత్రికల్లో ఇచ్చే ప్రకటనల వరకు అన్నింటినీ గుర్తించింది.