Good Governance Day in Telangana :దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సుపరిపాలన దినోత్సవం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు సర్కార్ ఓ ప్రకటనను విడుదల చేసింది. అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించాలని.. రాష్ట్రంలోని పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా.. కలిగిన మేలును ప్రముఖంగా ప్రస్తావించాలని తెలిపింది.
Good Governance Day in Telangana Decade Celebrations:దీంతో పాటు ఈ కార్యక్రమంలో ప్రజలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు.. అందరినీ భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఆయా జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు, కొత్త జిల్లాలు తదితర వివరాలతో కరపత్రం తయారు చేసి పంపిణీ చేయాలని వెల్లడించింది. వీటి వల్ల ప్రజలకు దూర భారం తగ్గడమే కాకుండా.. పరిపాలనాపరమైన పర్యవేక్షణ సులభతరమైన విషయాన్ని పేర్కొనాలని వివరించింది. వివిధ శాఖలను పునర్ వ్యవస్థీకరణ చేయడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతున్న విషయాన్ని వారికి వివరించాలని తెలిపింది.
- special lighting at Govt Offices : విద్యుత్ వెలుగుల్లో ప్రభుత్వ కార్యాలయాలు
ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, మిషన్ భగీరథ, హెల్త్, విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖలు పునర్ వ్యవస్థీకరించిన తీరుతెన్నులను.. తద్వారా ప్రజలకు చక్కని సేవలు అందుతున్న విధానాన్ని.. వీటి ప్రభావంతో ప్రజా జీవితంలో వచ్చిన మెరుగుదలపై నివేదిక తయారు చేయాలంది. రాష్ట్ర స్థాయిలోనూ సమావేశం నిర్వహించి, ఈ అంశాల గురించి వివరించాలని.. నూతనంగా ఏర్పడిన మండలాలు, మున్సిపాలిటీల్లో సంబురాలు జరిగేలా స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసింది.