Priyanka Gandhi Hyderabad Tour: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తోన్న నేపథ్యంలో ఆ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆమె ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌కు వస్తుండటంతో పర్యటనకు సంబంధించిన విధి విధానాలపై రాష్ట్ర కాంగ్రెస్ పీఏసీ ముఖ్య నేతలు వర్చువల్‌గా సమావేశమయ్యారు. జూమ్ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జీ మానిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు పాల్గొన్నారు.
సమావేశంలో ప్రియాంక గాంధీ రాష్ట్ర పర్యటన, సరూర్‌నగర్‌లో నిరుద్యోగుల నిరసన సభ అంశాలపై చర్చించారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని దిల్లీకి తిరిగివెళ్లే సమయంలో ఆమె హైదరాబాద్‌కు రానున్నారు. అదే రోజున ఎల్బీనగర్లోని తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతా చారి విగ్రహానికి నివాళి అర్పించి.. అక్కడి నుంచి సరూర్ నగర్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లాల పర్యటన పూర్తి చేసిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం.. ప్రియాంక గాంధీ సభకు భారీగా యువతను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ, బలరాం నాయక్ తదితర పీఏసీ పాల్గొని ప్రియాంక గాంధీ పర్యటనకు సంబంధించి విధి విధానాలపై ప్రధానంగా చర్చించారు.
Priyanka Gandhi Telangana Tour: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. 'హాథ్ సే హాథ్' జోడో యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేసి కార్యకర్తలను, స్థానిక ప్రజాప్రతినిధులను ఏకం చేసుకుంటూ వెళ్లగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర హస్తం నేతల్లో నూతన ఉత్సాహం ఇస్తోంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి నిరుద్యోగుల తరపున ఆ పార్టీ ముమ్మరంగా పోరాడుతోంది.