Telangana Congress Joinings 2023 : కాంగ్రెస్‌లో చాలా నియోజకవర్గాల్లో.. బలమైన నాయకుల కొరత ఉంది. గతంలో పార్టీలో చేరతామని చెబితే వెంటపడి చేర్చుకుంటూ వచ్చారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వంటివారు వస్తారని తెలియగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(PCC President Revanth Reddy).. వారి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. కానీ ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. జోష్ పెరుగుతున్న కొద్దీ.. హస్తం పార్టీలో చేరేందుకు పలువురు పోటీపడుతున్నా.. అధిష్ఠానం విముఖతతో పలువురు భంగపాటుకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇటీవల బీఆర్ఎస్లో టికెట్లు ఆశించి భంగపాటు గురైన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు(BRS Sitting MLAs), మాజీ ఎమ్మెల్యేలు, బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొందరు ఏఐసీసీ(AICC)ని సంప్రదించి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అలాంటి వారి 15 మంది పేర్లను పీసీసీకి పంపిన అధిష్ఠానం వారి పూర్తి వివరాలు ఇవ్వాలని కోరింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి.. ఆయా నాయకులు పార్టీలోకి వస్తే జరిగే లాభనష్టాలు, గెలుపు ఓటమిలను అంచనా వేసి నివేదించినట్లు తెలుస్తోంది. అవినీతి, ఇతర ఆరోపణలు ఉండడంతో కొందరికి అధికార బీఆర్ఎస్ టికెట్లు(BRS MLA Tickets) నిరాకరించినట్లు తేల్చారు. అదే విషయాన్ని ఏఐసీసీకి నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం.
Congress Joinings in Telangana 2023 :ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేకాంగ్రెస్‌లో టికెట్ కోసం దరఖాస్తు చేసినా.. ఇప్పటివరకు పార్టీలో చేర్చుకోలేదు. హైదరాబాద్‌కి ఎమ్మెల్యే, ఉమ్మడి వరంగల్‌కు చెందిన మరో ఎమ్మెల్యే హస్తం పార్టీలో చేరేందుకు యత్నించి భంగపాటుకు గురయ్యారని సమాచారం. ఇద్దరు ఎంపీలు టికెట్లు ఇస్తేనే వస్తామని చెప్పినట్లు విస్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే వారు టికెట్ అడుగుతున్నచోట కాంగ్రెస్‌కిబలమైనవారుంటంతో సర్దుబాటు చేసే పరిస్థితులు కనిపించడం లేదని తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు కలిసి వచ్చేటట్లుగా లేకపోవడం వల్లే పీసీసీ హామీ ఇవ్వలేకపోతున్నట్లు సమాచారం.