Telangana CM Revanth Reddy to Sign on Six Guarantees :కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే గ్యారెంటీల అమలుపై సంతకం చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రకటించింది. దీంతో నేడు ప్రమాణ స్వీకారం అనంతరం ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ప్రజలందరికీ రేవంత్‌రెడ్డి బహిరంగ ఆహ్వానం
గ్యారెంటీల అమలుకు సంబంధించిన దస్త్రాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూతకు సంబంధించి ఒక దస్త్రం రూపొందినట్లు తెలిసింది. ఉద్యోగాల భర్తీ,జాబ్ క్యాలెండర్‌కు(Job Calendar) సంబంధించిన మరో దస్త్రాన్ని కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. మరోవైపు అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని కూడా ప్రచార సమయంలో రేవంత్ ప్రకటించారు. మరి రేపు వీటిపై ముఖ్యమంత్రి సంతకాలు చేస్తారని అంటున్నారు. అటు గ్యారెంటీల అమలు కోసం అయ్యే ఖర్చు, ఖజానాపై ఆర్థిక భారానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు ఇవే :
1. మహాలక్ష్మి పథకం :కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నెరవేర్చేలా 6 గ్యారెంటీలు ఇస్తున్నట్లు సోనియా గాంధీ ప్రకటించారు. మహిళలను దృష్టిలో పెట్టుకొని మొదటి గ్యారెంటీగా సోనియా మహాలక్ష్మి పథకాన్ని(Mahalaxmi Scheme) ప్రకటించారు. రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.2500 చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించనుంది. రూ.500కు గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నారు.
2. రైతు భరోసా పథకం : దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతుల ప్రాణాలను కాపాడుకునేందుకు, అన్నదాత అభివృద్ధి కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చిందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రైతుభరోసా పథకం ప్రకటించారు. ఈ పథకం కింద ఎకరాకు రూ.15,000, పట్టా భూమి రైతులతో పాటు కౌలు రైతులకు రూ.15,000 రైతు భరోసా ఇవ్వనున్నట్లు చెప్పారు. భూమిలేని నిరుపేదలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12,000 చెల్లిస్తామని తెలిపారు. వరి పంటకు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ అందజేస్తామని వెల్లడించారు.