Today Telangana Cabinet meeting News : సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండల సమావేశం ఇవాళ సచివాలయంలో జరిగింది. సుమారు 5గంటల పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ కేబినేట్‌లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఇందులో ప్రధానంగా గవర్నర్ కోటాలో శాసన మండలికి ఇద్దరు సభ్యుల ఎంపిక చేసినట్లు కేటీఆర్ ప్రకటించారు. మండలి అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.
పది జిల్లాలను అతలాకుతలం చేసిన వరద ముంపుపై విస్తృతంగా చర్చ జరిపిన మంత్రివర్గం.. ముంపు ప్రాంతాల్లో మరమ్మతులు, పునరావాస తక్షణ చర్యల కోసం రూ. 500కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థికశాఖను ఆదేశించారు. వరద సమయంలో బాధితులను కాపాడిన ఇద్దరు విద్యుత్‌శాఖ సిబ్బంది, ఆశ్రమ పాఠశాల టీచర్‌ను అభినిందించిన కేబినెట్.. వారిని ఆగస్టు 15న సత్కరించాలని నిర్ణయించింది.
ఖమ్మంలో మున్నేరు ఒడ్డున ఆర్‌సీసీ వాల్ నిర్మించాలని నిర్ణయించిన కేబినెట్ వరదల్లో చనిపోయిన 40మందికిపైగా కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. పొలాల్లో ఇసుక మేటలు, అన్నింటినీ పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖను ఆదేశించినట్టు మంత్రి కేటీఆర్ వివరించారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 43 వేల 373 మంది ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి అసవరమైన విధివిధానాలు రూపొందించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.
TSRTC Merger in TS Govt : ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపుపై విధివిధానాల కోసం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామని మంత్రి కేటీఆర్ వివరించారు. ఇదే సమయంలో కేంద్రప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని.. రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారని గుర్తుచేశారు. గవర్నర్ తిరిగిపంపిన 3 బిల్లులను మరోసారి అసెంబ్లీలో ఆమోదించి పంపుతామని తెలిపారు. రెండోసారి ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించక తప్పదని కేటీఆర్ స్పష్టం చేశారు.
శాసనమండలికి గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ.. కేబినేట్ నిర్ణయం
ఇవీ చదవండి: