రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన కేబినెట్ భేటీ... తొమ్మిది గంటల పాటు రాత్రి 11 గంటల వరకు జరిగింది. కొత్త సచివాలయ నిర్మాణం, రాష్ట్రంలో కరోనా కట్టడి, నియంత్రిత సాగు తదితర అంశాలపై చర్చించింది. కొత్త సచివాలయ భవన నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. వివిధ అంశాలకు సంబంధించి పలు విధానాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. హైదరాబాద్ నగరంలో ఐటీ పరిశ్రమలు ఒకే చోట కాకుండా నగరం నలువైపులా విస్తరించేలా హైదరాబాద్ గ్రిడ్ పాలసీని ఆమోదించింది. పెరిగి పోతున్న వాహనాల వల్ల ఎక్కువయ్యే వాయు కాలుష్యాన్ని తగ్గించేలా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ విధానానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రత్యేక రాయితీలు ఇచ్చి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమను ప్రోత్సహించాలని నిర్ణయించింది.
టీఎస్ బీపాస్ విధానానికి ఆమోదం
భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టీఎస్ బీపాస్ విధానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. టీఎస్ ఐపాస్ తరహాలోనే టీఎస్ బీపాస్ కూడా అనుమతుల విషయంలో పెద్ద సంస్కరణ అని కేబినెట్ అభిప్రాయపడింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తయారు చేయాలని నిర్ణయించింది. పుట్టిన ఊరు, కన్న వారిని, కుటుంబాన్ని వదిలి పనికోసం తెలంగాణకు వచ్చే కార్మికులకు ఇదే తమ ఇల్లు అనే భావన, భరోసా కలిగించేలా విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించింది.
పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు
కొవిడ్ నేపథ్యంలో విద్యారంగానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్ ను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఆన్లైన్ తరగతులకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించాలని... డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది. దుమ్ముగూడెం అనకట్టకు సీతమ్మ సాగర్, తుపాకులగూడం ఆనకట్టకు సమ్మక్క ఆనకట్టగా పేర్లు పెడుతూ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.బస్వాపూర్ జలాశయానికి నృసింహస్వామి జలాశయంగా నామకరణం చేస్తూ కేబినెట్ తీర్మానించింది.