Telangana Assembly Sessions Live News 2023: బీఆర్‌ఎస్ సర్కారు పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. గత పదేళ్లలో అప్పులు దాదాపు పదిరెట్లు పెరిగాయని తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ ప్రత్యక్ష గ్యారంటీలు, పరోక్షంగా ఇచ్చిన హామీలు, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు తీసుకున్న రుణాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.6, 71,757 కోట్లకు చేరాయని వివరించింది. ఇందులో ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM) కింద తీసుకున్న రుణం రూ.3,89,673కోట్లు ఉన్నట్లు పేర్కొంది. కార్పొరేషన్ల అప్పులు రూ.1,27,208 కోట్లు, ప్రభుత్వ గ్యారంటీలతో కార్పొరేషన్ల రుణం రూ.95,462 కోట్లు, ఆయా సంస్థలు చెల్లించాల్సిన అప్పులు రూ.59,414 కోట్లు ఉన్నట్లు వివరించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పు రూ.74,590 కోట్లు అని వెల్లడించింది. వాటర్ కార్పొరేషన్ రూ.14,060 కోట్లు, మిషన్ భగీరథ కింద రూ.20,200 కోట్లు రుణాలు తీసుకున్నట్లు తెలిపింది. బడ్జెట్ అంచనాలకు, వాస్తవ ఖర్చులకు దాదాపు 20 శాతం అంతరం ఉన్నట్లు శ్వేతపత్రం స్పష్టం చేసింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా ఉండడం సహా ఉమ్మడి రాష్ట్రంతో పోల్చినా అధికంగానే ఉందని తెలిపింది. రాష్ట్రం అప్పుల కుప్పగా మారడం వల్ల రాష్ట్ర రెవెన్యూ రాబడుల్లో 34 శాతం అప్పులు, రీపేమెంట్లకే సరిపోతోందని శ్వేతపత్రంలో తెలిపారు. మరో 35 శాతం జీతాలు, పెన్షన్లకే కావాలని గుర్తు చేసింది. అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం 31 శాతమే మిగిలిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రోజూవారీ అవసరాల కోసం చేబదుళ్లు తీసుకోవాల్సిన దుస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తంచేసింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం - శాసనసభా వేదికగా లెక్కతేల్చనున్న ప్రభుత్వం
రాష్ట్రం ప్రస్తుత ఏడాదిలో 90 రోజులు ఆర్‌బీఐ వద్ద చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్ వంటి పద్ధతుల్లో నిధులు సమకూర్చుకుంటోందని పేర్కొంది. పదేళ్ల క్రితం మిగులు బడ్జెట్ స్థాయి నుంచి ప్రస్తుతం అప్పులు అనివార్యం అనే స్థితికి చేరుకుందని తెలిపింది. రాష్ట్ర జీఎస్‌డీపీలో అప్పుల భారం 36.9 శాతానికి చేరుకుందని వివరించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఇది 15.7 శాతమే ఉందని గుర్తుచేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం(FRBM) నిబంధనల ప్రకారం 25 శాతం దాటకూడదని పేర్కొంది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులను కూడా కలిపితే ఇది 36.9 శాతానికి చేరుకుందని పేర్కొంది.